![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు కాంబినేషన్ లో పలు మల్టిస్టారర్స్ వచ్చాయి. వాటిలో `కృష్ణార్జునులు` ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ సినిమాలో కృష్ణకి జోడీగా శ్రీదేవి నటించగా.. శోభన్ బాబుకి జంటగా జయప్రద కనువిందు చేశారు. అలాగే, ఇందులో శోభన్, శ్రీదేవి అన్నాచెల్లెళ్ళుగా అలరించారు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు ఉన్న ఇద్దరు మిత్రులు కృష్ణ (శోభన్ బాబు), అర్జున్ (కృష్ణ).. అభిప్రాయబేధాలతో విడిపోయి, చివరకు ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ సినిమా. రావు గోపాల రావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రసాద్ బాబు, పుష్పలత, కె. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వేటూరి, సి.నా.రె, దాసరి కలం నుంచి జాలు వారిన గీతాలకు సత్యం వినసొంపైన బాణీలు అందించారు. ``బంగారు బాలపిచ్చుక``, ``మంచు కొండల్లోన``, ``సుందర బృందావనిలో``, ``ఎవడబ్బ సొమ్మని``, ``కృష్ణార్జునులం``, ``మరదలా మరదలా``.. ఇలా ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల గానామృతంలో రూపొందిన ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. జయృకృష్ణ ఆర్ట్ మూవీస్ పతాకంపై జయకృష్ణ నిర్మించిన `కృష్ణార్జునులు`.. 1982 మార్చి 26న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ సినిమా 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |