![]() |
![]() |

పాపులర్ బాలీవుడ్ సింగర్, తెలుగులోనూ పలు పాటలు పాడి అలరించిన కేకే ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం కోల్‌కతాలో నజ్రుల్ మంచా ఆడిటోరియంలో జరిగిన మ్యూజిక్ కాన్సెర్ట్‌లో ప్రదర్శన ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన ఆయన, అక్కడ్నుంచి తను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. కేకే వయసు 53 సంవత్సరాలు. ఆయన ఆకస్మిక మృతితో సంగీత ప్రపంచం షాక్‌కు గురైంది.
నిజానికి ఆయన ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఆడిటోరియంలో ఏసీ సరిగా పనిచేయకపోవడంతో కేకే ఇబ్బంది పడినట్లు ఓ వీడియోలో కనిపించింది. ముఖమంతా చెమట్లు పట్టడంతో, తుడుచుకోవడానికి ఆయన మధ్యలో బ్రేక్ కూడా తీసుకున్నారు. "చాలా వేడిగా ఉంది" అంటూ చుట్టుపక్కల ఉన్నవాళ్లు మాట్లాడుతుండటం కూడా ఆ విడియోలో వినిపించింది. ఒక సందర్భంలో స్టేజ్ మీద కేకే ఓ వ్యక్తితో ఎసీ గురించి మాట్లాడినట్లు కనిపించింది.
కేకే మృతికి కారణమేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోస్ట్-మార్టమ్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు. ఆయనది అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కేకేను సీఎంఆర్ఐ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
'కేకే'గా పాపులర్ అయిన ఆయన పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నత్. హిందీలో, తెలుగులో 1990ల చివరలో, 2000 మొదట్లో ఆయన పాడిన పాటలు యూత్‌లో కల్ట్ స్టేటస్ పొందాయి. స్కూలు, కాలేజ్ ఫేర్‌వెల్ పార్టీల్లో, కల్చరల్ ఈవెంట్స్‌లో కేకే గొంతుక వినిపించడం సర్వసాధారణమైపోయింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, మరికొన్ని భాషల్లో వేలాది పాటలు ఆయన ఆలపించారు.
దాయి దాయి దామ్మా (ఇంద్ర), మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా (జల్సా), ఫీల్ మై లవ్ (ఆర్య), వచ్చాడురా (బృందావనం), చెలియా (ఎవడు), లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్), అవును నిజం (అతడు), ఇంతే ఇంతింతే (బాలు), లే లే లేలే (గుడుంబా శంకర్), గుర్తుకొస్తున్నాయీ (నా ఆటోగ్రాఫ్), చెలియ చెలియా (ఘర్షణ), ఐ యామ్ వెరీ సారీ (నువ్వే నువ్వే), యే మేరా జహా (ఖుషి) తదితర సూపర్ హిట్ సాంగ్స్ ఆయన పాడినవే.
![]() |
![]() |