'హనుమాన్' మూవీలో జయమ్మ!!
on Jun 17, 2021
విభిన్న పాత్రలతో తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులోనూ సత్తా చాటుతుంది. తెలుగులో వరలక్ష్మీ చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్', 'నాంది' సినిమాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా 'క్రాక్' సినిమాలో జయమ్మ పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దీంతో వరుస మూవీ ఆఫర్స్ ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం వరలక్ష్మిని ఓ కీలక పాత్రకు తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' లో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారని సమాచారం.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా 'హనుమాన్'. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'హనుమాన్'పై మంచి అంచనాలే ఉన్నాయి. జాంబిరెడ్డి సినిమాలో నటించిన తేజ సజ్జానే ఈ సినిమాలో కూడా హీరోగా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.