`బంగార్రాజు`లో జయప్రద?
on Jun 23, 2021
కింగ్ నాగార్జున అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `బంగార్రాజు`. 2016 నాటి సంక్రాంతి సెన్సేషన్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి కొనసాగింపు చిత్రంగా `బంగార్రాజు` తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో నాగ్ తో పాటు ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. నాగ్ కి తమ్ముడుగా చైతూ.. మనవడిగా అఖిల్ కనిపించనున్నారంటూ కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. `సోగ్గాడే చిన్ని నాయనా`లో తండ్రి పాత్ర (బంగార్రాజు)కి జోడీగా నటించిన సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ.. సీక్వెల్ లోనూ అదే వేషంలో కొనసాగనుంది. కాగా, మరో ముఖ్య పాత్రలో వెటరన్ యాక్ట్రస్ జయప్రద సందడి చేయనున్నారని సమాచారం. త్వరలోనే `బంగార్రాజు`లో జయప్రద ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో అలరించిన జయప్రద.. ఆయన వారసులు కలిసి నటించనున్న ఈ మల్టిస్టారర్ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న `బంగార్రాజు`ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మూవీ పూర్తయ్యేలోపే `బంగార్రాజు`ని పట్టాలెక్కించబోతున్నారు నాగ్.