`బంగార్రాజు`లో రంభగా మోనాల్?
on Aug 3, 2021
కింగ్ నాగార్జున కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయనా`లో తెరనిండా కథానాయికల సందడే కనిపించింది. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి దర్శనమివ్వగా అతిథి పాత్రలో అనుష్కా శెట్టి సందడి చేసింది. అలాగే అనసూయ, హంసా నందిని, దీక్షా పంత్ కూడా తమ గ్లామర్ తో కవ్వించారు.
కట్ చేస్తే.. `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రాబోతున్న `బంగార్రాజు`లోనూ గ్లామర్ నిండుగా ఉండబోతోందట. రమ్యకృష్ణతో పాటు మరో స్టార్ బ్యూటీ నాగ్ సరసన కనిపించనుండగా.. మరో హీరోగా నటించనున్న నాగచైతన్యకి జంటగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి ఆడిపాడ నుందని సమాచారం. అంతేకాదు.. కథానుసారం ఇందులో స్వర్గం ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ లో రంభగా కాసేపు `బిగ్ బాస్` బ్యూటీ మోనాల్ తళుక్కున మెరవనుందట. ఒక స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని డైలాగ్స్ కూడా మోనాల్ కి ఉంటాయని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఆగస్టు 20 నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న `బంగార్రాజు`ని కళ్యాణ్ కృష్ణ రూపొందించనుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మించనున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చనున్నాడు.