అది నిజం కాదు.. ఆ పాత్ర విజయ్ చేయడం లేదు!
on Nov 8, 2017
దురదగుండాకు ఎవడో తెచ్చి ఒకడికి పూస్తాడు.. వాడు ఆ దురదను అందరికీ అంటిస్తాడు. మీడియా వ్యవహారం అలా ఉంటుందన్నమాట. ‘మహానటి’ సినిమాలో అక్కినేని పాత్రను విజయ్ దేవరకొండ చేస్తున్నాడని ఎవరో.. అలా గాలికి అనేశాడు. అంతే.. ఇంకేముందీ.. చిన్న చిన్న వెబ్ సైట్ల నుంచి పెద్ద పెద్ద పత్రికల వరకూ అందరూ అదే న్యూస్. అసలు ఇది నిజమేనా? ఇందులో నిజం ఎంత? అని ఆలోచించే ఓపిక కూడా లేకుండా పోయింది పాపం.. మనోళ్లకు.
‘మహానటి’ లో దేవరకొండ విజయ్ నటిస్తున్న మాట నిజం. కానీ.. విజయ్ ది అందులో అక్కినేని పాత్ర కాదు. సమంతకు జోడీగా ఇందులో నటిస్తున్నాడు విజయ్. సావిత్రి కథ అంతా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో సాగుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లకముందు నేటి జనరేషన్ కి సంబంధించిన రెండు పాత్రలుంటాయ్. అవి జర్నలిస్టుల పాత్రలన్నమాట. ఆ పాత్రల్లో సమంత, దేవరకొండ విజయ్ నటిస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’ విడుదల అవ్వక ముందే తాను ఓకే చెప్పిన సినిమా ఇది. అయితే.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. ఆ పాత్రను ఇంకొంచెం పెంచడం జరిగిందని విశ్వసనీయ సమాచారం.
ఇదిలావుంటే.. ఇందులో ఎన్టీయార్ పాత్రను జూనియర్ ఎన్టీయార్ తోనే చేయించాలనే ధృఢ నిశ్చయంతో ఉన్నాడు నిర్మాత సి.అశ్వనీదత్. తారక్.. స్వప్నామీడియా నిర్మించిన ’స్టూడెంట్ నంబర్ వన్’ సినిమా తోనే స్టార్ అయిన విషయం తెలిసిందే. పైగా.. వాళ్లు ఎన్టీయార్ తో చేసిన ‘శక్తి’ సినిమా ఘోరమైన నష్టాలు చవిచూసింది. ఈ కారణాల చేతనైనా తారక్ ఈ పాత్ర చేయడం ఖాయం. ఇక అక్కినేని పాత్ర. ఈ పాత్రకు చైతూ.. ఎప్పుడో ‘ఎస్’ చెప్పాడు. సో.. తాతల పాత్రలు మనవళ్లే చేస్తారన్నమాట. దేవరకొండ విజయ్ మాత్రం అక్కినేని పాత్ర చేయడం లేదు. అదన్నమాట విషయం.