
ఉద్ధండుల్లాంటి సాంకేతిక నిపుణులు, ప్రతిభావంతులైన నటీనటులు మూడేళ్ళపాటు శ్రమించి రూపొందించిన సినిమా ‘ఐ’. ఇటీవల విడుదలైంది. ఈ సినిమా సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ మొదటి షో నుంచే ఫట్ టాక్ వచ్చింది. ‘ఐ’ నిజంగానే ఫట్టా అనే సందేహం సంగతి అలా వుంచితే, శంకర్ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు నిరాశకు గురయ్యారన్న మాట మాత్రం వాస్తవం. ఏ సినిమా అయినా ఊహించిన స్థాయిలో లేకపోతే ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమాని అందించడకపోవడం తప్పా.. లేక ఏ సినిమా మీద అయినా అధికంగా ఊహలు పేర్చుకోవడం ప్రేక్షకుల తప్పా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఇది విత్తుముందా.. చెట్టుముందా అనే ప్రశ్నల కంటే జటిలమైన ప్రశ్న. కాబట్టి ‘ఐ’ సినిమాకి వచ్చిన ఫట్ టాక్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా బాక్సాఫీసు దగ్గర మాత్రం ‘ఐ’ సినిమా పంబ రేపుతోంది. సినిమా విడుదలైన మొదటిరోజే ఏడు కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇదేమీ మామూలు విషయం కాదు. సినిమా చూసి వచ్చినవాళ్ళందరూ కొంత నిరాశ పడుతున్నప్పటికీ ఒక్కసారి చూడదగ్గ చిత్రమే అని చెబుతూ వుండటం కూడా ఈ సినిమాకి ప్లస్సయింది. మొత్తమ్మీద బాక్సాఫీసు పండితులు చెప్పేదేంటంటే.. ఈ సినిమా ఫట్టయినా కలెక్షన్ల పరంగా మాత్రం హిట్టే.





.jpg)
