(నవంబర్ 4 నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జయంతి సందర్భంగా..)
సినిమాల్లో నటించాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చి, చివరకు నిర్మాతగా మారి అగ్రస్థానానికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి, దర్శకుడిగానూ తనదైన ముద్ర వేయడం విశేషమే. అలాంటి అరుదైన ప్రయాణం వి.బి.రాజేంద్రప్రసాద్ సొంతం. ఈ పేరు చెప్పగానే ‘జగపతి పిక్చర్స్’, ‘దసరా బుల్లోడు’, అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన అనుబంధం గుర్తొస్తాయి. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొని రోజు రోజుకీ తన ఇమేజ్ను పెంచుకుంటున్న జగపతిబాబు తండ్రే వి.బి.రాజేంద్ర ప్రసాద్. అసలు నటుడిగా రావాలనుకున్నఆయన నిర్మాతగా ఎలా మారారు? తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఎలా సంపాదించుకున్నారు?
1932 నవంబర్ 4న కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో జన్మించారు వి.బి.రాజేంద్రప్రసాద్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చదువంతా సొంత ఊరు, కాకినాడలోనే సాగింది. కాలేజీ రోజుల్లోనే నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. ‘రాఘవ కళాసమితి’ పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి నాటకాలు ప్రదర్శించేవారు. ఆత్రేయ రచించిన ‘కప్పలు’ నాటకంలో స్త్రీ పాత్ర పోషించి ఉత్తమ కథానాయిక బహుమతి కూడా అందుకున్నారు. అంటే.. అప్పట్లోనే నటనపై ఆయనకు ఎంత ఆసక్తి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంతకాలం విజయవాడ, బందరు ప్రాంతాల్లో వ్యాపారాలు చేసినా, మనసులో మాత్రం సినిమా రంగంలోకి వెళ్లాలనే కోరిక అలాగే ఉండిపోయింది.
ఆ కోరికతోనే మద్రాస్ చేరుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కేవలం స్నేహంగానే ఆగిపోలేదు.. ఆయన జీవితాన్నే మరో మలుపు తిప్పింది. రాజేంద్రప్రసాద్‌లోని ఆసక్తిని, అభిరుచిని గుర్తించిన అక్కినేని ప్రోత్సహించారు. ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు పరిచయం చేశారు. అయితే నటుడిగా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో నటనపై ఉన్న ఆసక్తిని పక్కనపెట్టి, సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు. తండ్రి జగపతి చౌదరి పేరు మీద ‘జగపతి’ సంస్థను ప్రారంభించి, 1960లో ‘అన్నపూర్ణ’ చిత్రంతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘అదృష్టవంతులు’, ‘అక్కాచెల్లెలు’ వంటి సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘అంతస్తులు’ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆయన నిర్మాణ సంస్థకు మరింత పేరు తీసుకొచ్చింది.
నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ దర్శకత్వంపై కూడా ఆయనకు ఆసక్తి ఉండేది. అలా 1971లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ‘దసరా బుల్లోడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సాధించిన విజయం ఆయనను దర్శకుడిగా కూడా నిలబెట్టింది. ఆ తర్వాత ‘బంగారు బాబు’, ‘మంచి మనుషులు’, ‘అందరూ దొంగలే’, ‘బంగారు బొమ్మలు’, ‘రామకృష్ణులు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినిమాలతోనే ఆగిపోకుండా తమిళ, హిందీ భాషల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘రాస్తే ప్యార్ కే’, ‘బెకరార్’ వంటి హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఇక ‘పిచ్చిమారాజు’ సినిమా ద్వారా వచ్చిన లాభాలను చిత్ర బృందంతో పంచుకున్నారనే విషయం ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుకునే మరో ఆసక్తికరమైన అంశం. అందుకే పరిశ్రమలో ఆయనకు ‘జెంటిల్మెన్ ప్రొడ్యూసర్’ అనే గుర్తింపు కూడా ఉండేది.
ఇలా నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న వి.బి.రాజేంద్రప్రసాద్‌కు పురస్కారాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. ‘అంతస్తులు’ చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించగా, ‘ఆస్తిపరులు’ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. 2000లో కె.వి.రెడ్డి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2003 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. తర్వాతి కాలంలో సినిమాలకు దూరమైనా, ఫిలింనగర్లో ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 2015 జనవరి 12న ఆయన కన్నుమూశారు. నటుడిగా తెరపై కనిపించాలనుకున్న ఒక వ్యక్తి.. నిర్మాతగా ఎన్నో సినిమాలకు తెరతీసి, దర్శకుడిగా ప్రేక్షకులను అలరించి, తెలుగు సినిమా చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అదే వి.బి.రాజేంద్రప్రసాద్ విజయ ప్రస్థానం.
[V B Rajendra Prasad, V B Rajendra Prasad Biography, V B Rajendra Prasad Birthday, V B Rajendra Prasad Movies, Jagapathi Pictures, Jagapathi Pictures Producer, Dasara Bullodu Movie, Akkineni Nageswara Rao, Jagapathi Babu Father, Telugu Film Producers, Telugu Film Directors, Raghupathi Venkaiah Award, Telugu Cinema History, V B Rajendra Prasad Life Story, Gentleman Producer V B Rajendra Prasad]





