Home

»

Featured News

నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సినిమా నిషేధం వెనుక సంచలన నిజాలు.!

Jul 23, 2026 7:53PM

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతాలు, సంచలనాలు నమోదయ్యాయి. అయితే 1974లో విడుదలైన ఎన్టీఆర్ అపురూప చిత్రం 'తాతమ్మ కల' సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. కుటుంబ నియంత్రణకు, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఈ చిత్రంలో సంభాషణలు ఉండటం ఆ కాలంలో పెద్ద దుమారమే లేపింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిషేధానికి గురైన తొలి సినిమాగా ఇది నిలిచింది. ఈ వివాదం ఎంత దూరకెళ్లిందంటే, ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం దీనిపై చర్చ జరగడం విశేషం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని అంశాలను మార్చి, చిత్ర నిర్మాతగా ఎన్టీఆర్ స్వయంగా వివరణ ఇచ్చి మళ్లీ సెన్సార్ అనుమతి పొందిన తర్వాతే ఈ చిత్రం రెండోసారి విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో ఇన్ని అడ్డంకులను ఎదుర్కొని, రీరిలీజ్ అయిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

ఇన్ని వివాదాలు, సంచలనాల మధ్యే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 రోజులు ప్రదర్శించబడి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, వివాదాలు చుట్టుముట్టినా ఉత్తమ కథగా నంది అవార్డును సొంతం చేసుకోవడం ఈ చిత్ర ప్రత్యేకత. నటసార్వభౌమ ఎన్టీఆర్ లాంటి మహానటుడు స్వయంగా నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి, తానే తాతమ్మ భర్తగా, మనవ‌డిగా ద్విపాత్రాభినయం చేసినప్పటికీ, ఈ సినిమాకు అసలు సిసలైన హీరో మాత్రం నటి భానుమతే. ఎన్టీఆర్ అంతటి దిగ్గజ నటుడి ఎదుట ఏమాత్రం బెదరకుండా, ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనం. భానుమతి ధైర్యానికి, ఆమె నటనకు ఈ సినిమా ఒక పెద్ద పీఠం వేసింది. ఎన్టీఆర్, భానుమతి మధ్య వచ్చే 'కోరమీసం కుర్రోడా' పాటలో ఇద్దరి పోటాపోటీ అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఈ చిత్రంలో తొలిసారి బాలకృష్ణ బాలనటుడిగా నటించడం విశేషం. అలాగే ఎన్టీఆర్, కాంచన, హరికృష్ణ, రోజారమణి, రాజబాబు, మాడా వంటి ప్రముఖ తారాగణం ఇందులో నటించారు. ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో కొసరాజు రాసిన పాటలు అప్పట్లో శ్రోతలను ఎంతగానో అలరించాయి. 'ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు', 'అయ్య లాలీ ముద్దులయ్య లాలీ', 'శెనగపూల రెయికాదానా జారుపైటా చిన్నదానా' వంటి అద్భుతమైన పాటలు ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయం చేయలేక బస్తీలకు చేరే ఆసాముల కథాంశంతో పాటు, కుటుంబ విలువలు, తాతమ్మ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడదగ్గ అరుదైన కళాఖండం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com