వాట్ ఎ విజువల్ వండర్.. 'ఆర్ఆర్ఆర్' గ్లిమ్స్!
on Nov 1, 2021
'ఆర్ఆర్ఆర్'.. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్యారెక్టర్లను విడివిడి టీజర్లతో చూపించిన యస్.యస్. రాజమౌళి తొలిసారి ఆ ఇద్దరినీ ఒకే వీడియోలో చూపించి వారి అభిమానులకు దీపావళి పండగను ముందే తెచ్చేశాడు. 'ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్' పేరిట సోమవారం ఉదయం మేకర్స్ 45 సెకన్ల వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా అంటే ఏమిటో ఇప్పటికే 'బాహుబలి' సిరీస్ ద్వారా ప్రపంచానికి రుచి చూపించిన రాజమౌళి.. ఇప్పుడు దానికి మించిన రేంజ్లో 'ఆర్ఆర్ఆర్'ను ప్రెజెంట్ చేస్తున్నాడని ఆ చిన్న వీడియో ద్వారా అర్థమవుతోంది.
రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో ఉంటాయని మనకు తెలుసు. 'ఆర్ఆర్ఆర్'లో యాక్షన్ ఎపిసోడ్స్ మరింత పీక్స్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ గ్లిమ్స్‌లో అటు రామ్‌చరణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ రొమాలు నిక్కబొడిచేలా చేసే యాక్షన్ సీన్స్‌లో వీరవిహారం చేస్తూ దర్శనమిచ్చారు. ఆ ఇద్దరితో పాటు హీరోయిన్లు అలియా భట్, ఒలీవియా మోరిస్, క్రూషియల్ రోల్ చేసిన అజయ్ దేవ్‌గణ్ కూడా కనిపించారు.
ఒక ఉరికొయ్య బ్యాక్‌డ్రాప్‌లో ఈ వీడియోను రూపొందించారు. ఎవరి కోసం ఆ ఉరికొయ్యను సిద్ధం చేశారనేది సస్పెన్స్. ఉరి తీసే జైలు దగ్గరకు జనం తండోపతండాలుగా ఎడ్ల బళ్లపై వచ్చినట్లు వీడియో మొదట్లో మనం చూడవచ్చు. జనం ఇనుప కంచెను నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంటే వారిపై గుళ్లవర్షాన్ని కురిపించారు బ్రిటిష్ సైనికులు.
అడవిలో ఒక వ్యక్తిని పులి వెంటాడటం, తారక్ నెత్తి మీద నుంచి కంటిపైకి నెత్తురు ధారగా కారడం, అజయ్ దేవ్‌గణ్ తుపాకిని పేల్చడం, చరణ్ గుర్రంపై, తారక్ బైక్‌పై కలిసి ఒక చెరువు పక్క నుంచి దౌడు తీస్తుండటం, ఉరికొయ్య దగ్గరకు సైనికులు పరుగున రావడం, అలియా ఆశ్చర్యపోతూ చూడ్డం, బ్రిడ్జిపైన భయానక వాతావరణం, తారక్-చరణ్ యాక్షన్ మోడ్, బ్రిటీష్ సైనికుడి పైకి భీకరంగా గర్జిస్తూ పులి దూకడం.. లాంటి సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మనకు ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు.
అయితేనేం.. ఈ చిన్న వీడియో చూస్తుంటే తెలిసిపోతోంది.. రాజమౌళి మన ముందుకు ఒక విజువల్ వండర్‌ను తీసుకు వస్తున్నాడని, ఒక ఫాంటసీ వరల్డ్‌లోకి మనల్ని తీసుకువెళ్లనున్నాడని! వీఎఫ్ఎక్స్ సహాయంతో అద్భుతమనిపించే విజువల్స్‌తో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోందనేది స్పష్టం. ఇండియన్ సినిమా గ్లోరీని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్న 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న, సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సమేత రాజమౌళి సైన్యం సృష్టించే ప్రభంజనం ఎలా ఉంటుందో చూడ్డమే మిగిలుంది.
Also Read