Home

»

Featured News

విలన్ నుంచి విద్యావేత్త వరకు.. మంచు మోహన్‌బాబు అరుదైన సినీ ప్రస్థానం!

Mar 18, 2026

(మార్చి 19 మంచు మోహ‌న్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..)

 

- మోహన్‌బాబు కెరీర్‌లో మైలురాళ్ళు ఇవే

- మంచు భక్తవత్సలం టు కలెక్షన్ కింగ్

- నటుడిగా 550, నిర్మాతగా 72 సినిమాలు

టాలీవుడ్ లెజెండరీ నటుడు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే న‌టుడు డా.మంచు మోహ‌న్‌బాబు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన చేయ‌ని క్యారెక్ట‌ర్ లేదు. తనదైన డైలాగ్ డెలివరీతో, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో కొన్ని వందల పాత్రలకు ప్రాణం పోసిన ఈ నట దిగ్గ‌జం మోహ‌న్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

1952 మార్చి 19న చిత్తూరు జిల్లాలోని మోదుగులపాలెంలో మంచు నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు మోహన్‌బాబు. ఆయన అసలు పేరు భక్తవత్సలంనాయుడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్‌లోని వైఎంసిఎ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా చాలాకాలం పనిచేశారు. 1970 ప్రాంతంలో సినిమాల మీద ఆసక్తితో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా 5 సంవత్సరాలపాటు పనిచేశారు. 

దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ‘స్వర్గం నరకం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన నటన చూసి పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సహనటుడిగా, విలన్‌గా, హీరోగా పలు విభిన్నమైన పాత్రలు పోషించిన మోహన్‌బాబు మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. తన 50 సంవత్సరాల కెరీర్‌లో 550కి పైగా సినిమాల్లో నటించి కలెక్షన్‌కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు.

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు తన సత్తా చాటారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తనే హీరోగా నటిస్తూ ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి తన బేనర్‌లో పలు విభిన్నమైన సినిమాలు నిర్మించి అభిరుచిగల నిర్మాత అనిపించుకున్నారు. ‘పెదరాయుడు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘అల్లుడుగారు’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘మేజర్ చంద్రకాంత్‌’ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. తన బేనర్‌లో మొత్తం 72 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు మోహన్‌బాబు. 

కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, విద్యా రంగంలోనూ మోహన్‌బాబు తనదైన ముద్ర వేశారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా వేలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా విద్యాదానం చేస్తూ సమాజంపై తనకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. శ్రీ విద్యానికేతన్ ఇప్ప్పుడు మోహన్‌బాబు యూనివర్సిటీగా రూపాంతరం చెంది ఉన్నత విద్యను అందిస్తోంది. 

నటుడుగా, నిర్మాతగా, విద్యావేత్తగానే కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించి 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్ప్పుడప్ప్పుడు తనకు సరిపడా క్యారెక్టర్స్ వస్తే తెరపై కనిపిస్తున్నారు. గత ఏడాది మంచు లక్క్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన ‘దక్ష’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాబోయే చిత్రాల్లో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్‌’ చిత్రంలో, సూపర్‌స్టార్ కష్ణ మనవడు, రమేష్‌బాబు తనయుడు జయకష్ణ హీరోగా అజయ్ భూపతి రూపొందిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు మంచు మోహన్‌బాబు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com