Home

»

Featured News

‘భక్త కన్నప్ప’కు 50 ఏళ్లు:  రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు కెరీర్‌ను మలుపు తిప్పిన క్లాసిక్!

May 25, 2026 7:46PM

టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అపురూప దృశ్యకావ్యాల్లో రెబ‌ల్‌స్టార్‌ కృష్ణంరాజు కథానాయకుడిగా నటించిన ‘భక్త కన్నప్ప’ అగ్రస్థానంలో ఉంటుంది. భక్తిరస చిత్రాలను సరికొత్త పంథాలో ఆవిష్కరించిన ఈ అద్భుత కావ్యం 1976 మే 26న విడుదలైంది. 2026 మే 26కి విజయవంతంగా 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ప్రియులు, కృష్ణంరాజు అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

కెరీర్ ప్రారంభంలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించిన కృష్ణంరాజుకు సరైన బ్రేక్ రావడం లేదని భావించిన తరుణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అప్పట్లో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన మరియు ఆయన సోదరుడు సూర్యనారాయణరాజు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకరత్న బాపు, ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణల కాంబినేషన్‌లో గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు.

కన్నడలో ఘనవిజయం సాధించిన ‘బేడర కన్నప్ప’ కథకు మరింత నాటకీయతను జోడించి బాపు-రమణలు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అర్జునుడి మరుజన్మ వృత్తాంతంతో మొదలయ్యే తిన్నడి కథ, శివభక్తితో పరవశించిపోయి కళ్లనే దానం చేసే పరమార్థం వరకు ప్రతి ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం. అమాయకమైన గిరిజన యువకుడిగా, ఆపై పరమ శివభక్తుడిగా కృష్ణంరాజు ఒదిగిపోయిన తీరు ఆయన నటనకు కొత్త మైలురాయిని అందించింది.

ఈ చిత్రంలో కృష్ణంరాజు సరసన వాణిశ్రీ కథానాయికగా నటించగా, రావుగోపాలరావు, శ్రీధర్, ప్ర‌భాక‌ర‌రెడ్డి వంటి సీనియర్ తారాగణం కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు సత్యం అందించిన బాణీలు, వేటూరి, ఆరుద్ర, సినారె కలాల నుంచి జాలువారిన పాటలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా "శివ శివ శంకర... భక్త వశంకర..." అనే గీతం నేటికీ ప్రతి శివరాత్రి పర్వదినాన మారుమోగు తూనే ఉంటుంది.

ఎక్కువ భాగం అవుట్‌డోర్ లోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. విభిన్నమైన లుక్‌లో కనిపించిన రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజుకు ఈ చిత్రం స్టార్‌డ‌మ్‌ తెచ్చిపెట్టింది. అప్పట్లోనే ఈ పౌరాణిక చిత్రం భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాదు, కృష్ణంరాజు సినీ ప్రస్థానంలో తొలిసారిగా 200 రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘భక్త కన్నప్ప’ సినిమాకు సంబంధించిన అరుదైన వర్కింగ్ స్టిల్స్, రికార్డుల వివరాలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాలు దాటినా ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి తరం దర్శకులకు కూడా ఈ సినిమా ఒక మాస్టర్ క్లాస్ లాంటిదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి మరెన్నో భక్తిరస విజువల్ వండర్స్ రాబోతున్నప్పటికీ, ‘భక్త కన్నప్ప’ సాధించిన క్లాసిక్ స్టేటస్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. విలక్షణ నటనతో, విజువల్ గ్రాండ్‌నెస్‌తో మెప్పించిన ఈ అద్భుత చిత్రం తెలుగు సినీ చరిత్రలో సమున్నత స్థానంలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com