Home

»

Featured News

ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. ‘కర్తవ్యం’లో విలన్‌గా మెప్పించిన ఈ నిర్మాత ఎవరో తెలుసా.?

Nov 7, 2026 1:29PM

తెలుగు చిత్రసీమలో నటీనటులుగా, దర్శకనిర్మాతలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే కొందరు తెరవెనుక ఉంటూనే చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి వారిలో అట్లూరి పుండరీకాక్షయ్య ఒకరు. నందమూరి తారక రామారావుకు అత్యంత ఆప్తుడిగా, ఆయనను అభిమానంతో 'బావా' అని పిలుస్తూ సన్నిహితంగా మెలిగిన పుండరీకాక్షయ్య.. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. అంతేకాదు.. నటుడిగా మారి విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు.

1925 ఆగస్టు 19న కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కలవపూడిలో జన్మించారు పుండరీకాక్షయ్య. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఎనిమిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి, తండ్రి వద్ద పనిచేస్తూనే నాటకాల్లో నటించేవారు. నందమూరి కుటుంబంతో ఆయన కుటుంబానికి మంచి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ విజయవాడలో చదువుకునే రోజుల్లో పుండరీకాక్షయ్య ఇంట్లోనే తన టిఫిన్ క్యారియర్ పెట్టుకునేవారు. అలా ఏర్పడిన పరిచయం క్రమంగా ఆత్మీయ అనుబంధంగా మారింది. ఎన్టీఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నాటక సంస్థలోనూ పుండరీకాక్షయ్య నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి ఆ సంస్థ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

ఎన్టీఆర్ సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన పిలుపుతో త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య కూడా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ బ్యానర్‌పై రూపొందిన పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ, పాండురంగ మహాత్మ్యం, సీతారామకళ్యాణం, గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్లామా వంటి చిత్రాల నిర్మాణ వ్యవహారాల్లో పుండరీకాక్షయ్య కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా జయసింహ విజయం సాధించడంతో ఎన్ఏటీ సంస్థకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల నిర్మాణంలో త్రివిక్రమరావుకు చేదోడు వాదోడుగా నిలిచారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి భాగస్వామి నిర్మాతగా వ్యవహరించే అవకాశం పుండరీకాక్షయ్యకు లభించింది. ఆ సినిమా విజయం సాధించడంతో నిర్మాతగా ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. అనంతరం శ్రీకృష్ణావతారం, భలే తమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మావారి మంచితనం వంటి చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా 1976లో విడుదలైన ఆరాధన మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాల ద్వారా ఎన్టీఆర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం మరింత బలపడింది. పంపిణీదారునిగా కూడా పుండరీకాక్షయ్య రాణించారు. ఎన్టీఆర్‌ను ఎప్పుడూ 'బావా' అంటూ ఆప్యాయంగా పిలిచే ఆయన.. తన సినీ ప్రయాణంలో సాధించిన విజయాల వెనుక ఎన్టీఆర్ ప్రోత్సాహం, అండదండలు ఉన్నాయని చెప్పుకునేవారు.

ఇది కూడా చదవండి: ఒక్క డైలాగ్‌తో నవ్విస్తారు, ఒక్క మాటతో మనసు గెలుస్తారు.. ఆ మ్యాజిక్ ఏమిటో తెలుసా.?

ఇక నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే పుండరీకాక్షయ్య నటుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన కర్తవ్యం సినిమాలో ముద్దు కృష్ణయ్య అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా ఆయన నట జీవితంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత మామ-కోడలు, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ, శివయ్య వంటి తెలుగు సినిమాలతో పాటు కొన్ని కన్నడ చిత్రాల్లోనూ నటించారు. 

ఆయన నటించిన రాఘవయ్య గారి అబ్బాయి చివరిగా విడుదలైన చిత్రంగా నిలిచింది. ఇలా నిర్మాతగా ఎన్టీఆర్‌తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి, నటుడిగా విలన్ పాత్రలతోనూ గుర్తింపు సంపాదించుకున్న అట్లూరి పుండరీకాక్షయ్య 2012 ఫిబ్రవరి 2న కన్నుమూశారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌కు ఆప్తుడిగా, ప్రతిభావంతుడైన నిర్మాతగా ఆయన పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మీకు నచ్చవచ్చు: రెమ్యునరేషన్ తక్కువైందని సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.!

 

 

 

[Atluri Pundarikakshayya, NTR Close Friend, NTR Producer, Telugu Film Producers, NTR Movies, Karthavyam Movie Villain, Telugu Cinema History, National Art Theatre, Nandamuri Taraka Rama Rao]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com