(నవంబర్ 10 దర్శకుడు తాతినేని రామారావు జయంతి సందర్భంగా..)
తెలుగు సినిమా దర్శకులు బాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దర్శకుల్లో తాతినేని రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన, హిందీలోనూ వరుసగా సినిమాలు తీసి అక్కడి ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణాదిలో విజయం సాధించిన కథలను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలచి విజయాలు అందుకోవడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలోనూ అదే స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత.
1938 నవంబర్ 10న కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మించిన తాతినేని రామారావుకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత కె. ప్రత్యగాత్మ దగ్గర కూడా అసోసియేట్‌గా పనిచేశారు. నిర్మాత ఏ.వి.సుబ్బారావు ప్రోత్సాహంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం ‘నవరాత్రి’ని తెలుగులో ఏఎన్నార్, సావిత్రి ప్రధాన పాత్రల్లో అదే పేరుతో తెరకెక్కించారు. ఆ తర్వాత ఏఎన్నార్‌తో చేసిన ‘బ్రహ్మచారి’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కృష్ణ, శోభన్ బాబులతో ‘మంచి మిత్రులు’, ఏఎన్నార్‌తో ‘సుపుత్రుడు’, ‘రైతు కుటుంబం’ వంటి చిత్రాలు రూపొందించారు. అయితే డి.రామానాయుడు నిర్మాణంలో వచ్చిన ‘జీవనతరంగాలు’ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకోవడంతో దర్శకుడిగా ఆయన పేరు మరింతగా వినిపించింది.
ఇక 1977లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘యమగోల’ తాతినేని రామారావు కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయింది. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయనకు తెలుగులోనే కాకుండా హిందీలోనూ అవకాశాలు వచ్చాయి. ‘యమగోల’ కథను హిందీలో ‘లోక్ పరలోక్’ పేరుతో జితేంద్ర, జయప్రద జంటగా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో విజయవంతమైన ‘ఆలుమగలు’ను హిందీలో ‘జుదాయి’గా, ‘కార్తీక దీపం’ను ‘మాంగ్ భరో సజనా’గా, ‘అంతులేని కథ’ను ‘జీవన్ ధార’గా రూపొందించారు. ఇక ‘చట్టానికి కళ్ళులేవు’ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లతో ‘అంధా కానూన్’గా తెరకెక్కించి హిందీలోనూ మంచి విజయాన్ని అందుకున్నారు. ‘ముగ్గురు మిత్రులు’ను ‘దోస్తీ దుష్మనీ’గా, ‘మయూరి’ని ‘నాచే మయూరి’గా, ‘సంసారం ఒక చదరంగం’ను ‘సంసార్’గా, ‘పెదరాయుడు’ను ‘బులందీ’గా హిందీలో రీమేక్ చేశారు.
కేవలం రీమేక్ సినిమాలకే పరిమితం కాకుండా హిందీలో సొంత కథలతోనూ సినిమాలు రూపొందించారు తాతినేని రామారావు. అమితాబ్ బచ్చన్‌తో ‘ఇంక్విలాబ్’, ‘ఆఖ్రీ రాస్తా’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. మరోవైపు హిందీలో విజయం సాధించిన ‘ఆశా’ను తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అనురాగదేవత’గా రూపొందించారు. శోభన్ బాబుతో తీసిన ‘ఇల్లాలు’, కృష్ణతో తెరకెక్కించిన ‘పచ్చని సంసారం’ కూడా హిందీ చిత్రాల రీమేక్‌లే. ఏఎన్నార్‌తో ‘దొరబాబు’, ‘ఆలుమగలు’, ‘శ్రీరామరక్ష’ వంటి సినిమాలు చేసిన ఆయన, ఎన్టీఆర్‌తో ‘యమగోల’, ‘ఆటగాడు’, ‘అనురాగదేవత’ చిత్రాలను అందించారు. బాలకృష్ణతో ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’, ‘తల్లిదండ్రులు’ వంటి సినిమాలకూ దర్శకత్వం వహించారు. 2000లో గోవింద హీరోగా వచ్చిన ‘బేటీ నంబర్ వన్’ ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం. తెలుగు కథలను హిందీ ప్రేక్షకులకు పరిచయం చేయడంలోనూ, అక్కడి విజయవంతమైన కథలను మన ప్రేక్షకులకు అందించడంలోనూ తనదైన ముద్ర వేసిన తాతినేని రామారావు పేరు రెండు చిత్ర పరిశ్రమల్లోనూ గుర్తుండిపోతుంది.
[Tatineni Rama Rao, Tatineni Rama Rao Director, Yamagola Movie, NTR Yam Gola, Amitabh Bachchan Movies, Inquilaab Movie, Aakhree Raasta, Andha Kanoon, Lok Parlok, Judai Movie, Jeevan Dhaara, Mang Bharo Sajana, Telugu Directors in Bollywood, Telugu Cinema Directors, Bollywood Remake Movies, Telugu to Hindi Remakes, NTR Movies]





