
సినిమా టీజర్ విడుదలైతే ప్రమోషన్స్ ఊపందుకోవాలి. కానీ బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ నటించిన ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం మొదలైంది. వైద్యులపై హింసను చూపించడమేంటంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదం కారణంగా ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 19న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అందులో వైద్య వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించే వ్యక్తిగా సన్నీ డియోల్ కనిపించారు. కొందరు వైద్యులు రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ, కమిషన్ల కోసం అనవసరమైన పరీక్షలు చేయిస్తున్నారనే కోణంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అంతేకాదు, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి చేసే సన్నివేశాలు కూడా టీజర్లో కనిపించాయి.
ఈ సన్నివేశాలపై ఐఎంఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు వైద్యులు చేసే తప్పులను మొత్తం వైద్య వృత్తికి ఆపాదించినట్లు సినిమా ప్రచార కంటెంట్ ఉందని ఆ సంఘం పేర్కొంది. వైద్యులపై దాడులను సమర్థించేలా లేదా వీరోచితంగా చూపించడం వల్ల ప్రజల్లో వైద్యులపై అపనమ్మకం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాసిన ఐఎంఏ.. సినిమా ప్రచార కంటెంట్‌ను సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. సినిమా సెన్సార్ సర్టిఫికేషన్‌ను కూడా నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: బన్నీ-బోయపాటి కాంబో.. ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.!
ఐఎంఏ ఫిర్యాదు, సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా.. నవంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2026లో డిసెంబర్ నెలలో ఇప్పటికే పలు భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, వచ్చే ఏడాది జనవరి 15న సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు సినిమా విషయంలో తమ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మేకర్స్ చెబుతున్నారు. మొత్తం వైద్య వృత్తిని తప్పుగా చూపించడం తమ ఉద్దేశం కాదని, వ్యవస్థలోని కొందరు వ్యక్తుల అవినీతి, దోపిడీని మాత్రమే కథలో ప్రస్తావించామని స్పష్టం చేశారు. టీజర్‌లోని కొన్ని సెకన్ల సన్నివేశాలను చూసి మొత్తం కథపై అభిప్రాయానికి రావద్దని, పూర్తిస్థాయి సినిమాను చూసిన తర్వాతే నిర్ణయించుకోవాలని కోరారు.

‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ 2018లో విడుదలైన మలయాళ హిట్ మూవీ ‘జోసెఫ్’కు హిందీ రీమేక్. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ డియోల్‌తో పాటు రవికిషన్, ప్రగ్యా జైస్వాల్, జిషు సేన్‌గుప్తా, టిను ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
‘జోసెఫ్’ సినిమాలో అవయవాల అక్రమ రవాణా, వైద్య వ్యవస్థలోని నేరాల చుట్టూ కథ సాగుతుంది. అదే కథను హిందీ ప్రేక్షకులకు అనుగుణంగా తెరకెక్కించారు. అయితే టీజర్‌లోని సన్నివేశాల కారణంగా విడుదలకు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది.
మీకు నచ్చవచ్చు:
‘వారణాసి’ నుంచి అఫీషియల్ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి బ్లాస్టింగ్ న్యూస్.!
ఎన్టీఆర్ లైనప్‌లో భారీ మార్పులు.. నెక్స్ట్ నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.!
[Sunny Deol, Suryaa Postponed, IMA Complaint, Bollywood, Suryaa Movie]




