భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ‘షోలే’ ఒకటి. 1975లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇప్పటికీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటోంది. ఇందులోని జై, వీరూ, గబ్బర్ సింగ్, ఠాకూర్, బసంతి పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అయితే ఈ పాత్రల్లో మనం చూసిన నటీనటులు మొదట అనుకున్నవారు కాదనే విషయం చాలామందికి తెలియదు. సినిమా క్యాస్టింగ్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. మొదట ఒకరిని అనుకున్న పాత్రలో చివరకు మరొకరు నటించి చరిత్ర సృష్టించారు.
ముందుగా జై పాత్ర విషయానికి వస్తే.. ఈ పాత్ర కోసం మొదట శత్రుఘ్న సిన్హా పేరును పరిశీలించారు. అయితే రచయితలు సలీమ్ ఖాన్, జావేద్ అక్తర్ మాత్రం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని సూచించారు. దర్శకుడు రమేష్ సిప్పీ కూడా చివరకు అమితాబ్ వైపే మొగ్గు చూపారు. అప్పటికి అమితాబ్ స్టార్ హీరోగా ఎదుగుతున్న దశలోనే ఉన్నారు. అలా జై పాత్ర ఆయనకు దక్కింది. ఇక వీరూ పాత్రకు ధర్మేంద్రను ఎంపిక చేయడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. నిజానికి ధర్మేంద్రకు గబ్బర్ సింగ్, ఠాకూర్ పాత్రలపై ఆసక్తి ఉండేదట. కానీ వీరూ పాత్ర చేస్తే హేమమాలినితో కలిసి నటించే అవకాశం ఉంటుందని భావించి ఆ పాత్రకు అంగీకరించారు. అలా వీరూ పాత్ర ధర్మేంద్రకు దక్కింది.
ఇక ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్ర కోసం మొదట దిలీప్ కుమార్‌ను సంప్రదించినట్లు సమాచారం. కానీ, ఆయన ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ప్రాణ్ పేరు కూడా ఈ పాత్ర కోసం పరిశీలనలోకి వచ్చింది. మరోవైపు సంజీవ్ కుమార్‌కు కూడా గబ్బర్ పాత్రపై ఆసక్తి ఉండేది. కానీ చివరకు ఆయనకు ఠాకూర్ పాత్ర దక్కింది. ఈ సినిమాలో చేతులు కోల్పోయిన ఠాకూర్‌గా సంజీవ్ కుమార్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక గబ్బర్ సింగ్ పాత్రకు మొదట డానీ డెంజోంగ్పాను అనుకున్నారు. అయితే ఆయన అప్పటికే ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మాత్మ’ సినిమాకు డేట్స్ కేటాయించడంతో షోలేలో నటించలేకపోయారు. దీంతో ఆ అవకాశం అమ్జద్ ఖాన్‌కు దక్కింది.
ఇది కూడా చదవండి: రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలే టార్గెట్.. వరస హత్యల వెనుక అసలు కథ ఏమిటంటే.?
అయితే గబ్బర్ సింగ్‌గా అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేయడంపై కూడా మొదట కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన గొంతు ఈ పాత్రకు సరిపోతుందా అని రచయిత జావేద్ అక్తర్ భావించారట. కానీ దర్శకుడు రమేష్ సిప్పీ మాత్రం అమ్జద్ ఖాన్ రూపం, వ్యక్తిత్వం ఈ పాత్రకు సరిపోతాయని నమ్మారు. చివరకు ఆయన గబ్బర్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ‘కిత్నే ఆద్మీ థే?’ అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి. ఇలా ‘షోలే’ సినిమాలో ఒక్కో పాత్ర వెనుక ఎన్నో ఆసక్తికరమైన ఎంపికలు, మార్పులు జరిగాయి. ఒకవేళ మొదట అనుకున్న నటీనటులే ఈ పాత్రలు చేసి ఉంటే ‘షోలే’ సినిమా ఎలా ఉండేదో కదా!
మీకు నచ్చవచ్చు:
అనిరుధ్, కావ్య పెళ్లి వీడియో చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. అందులో ఏముందంటే?
ప్యారడైజ్‌పై బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు: దరిద్రం వెంటపడితే అంతే!
[Sholay, AmitabhBachchan, Dharmendra, AmjadKhan, SanjeevKumar]





