బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, జైలు జీవితం, కెరీర్లో ఎత్తుపల్లాలు.. ఇలా ఆయన ప్రయాణంలో అనేక మలుపులు ఉన్నాయి. అయితే తన జీవితంలో ఎదురైన కష్టాలకు గత జన్మలో చేసిన కర్మలే కారణమని సంజయ్ దత్ ఒక సందర్భంలో చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించిన 'కాఫీ విత్ కరణ్' ఐదో సీజన్లో నటి సుస్మితా సేన్‌తో కలిసి పాల్గొన్నప్పుడు ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ఒక స్నేహితుడి సూచనతో తాను ఓ చిన్న గ్రామానికి వెళ్లానని సంజయ్ దత్ చెప్పారు. అక్కడ తన వేలిముద్ర ఆధారంగా తాళపత్రాలను వెతికి, వాటి ద్వారా గత జన్మ వివరాలు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆ తాళపత్రాల ప్రకారం అశోకుడి సామ్రాజ్య కాలంలో తాను ఒక రాజుగా ఉండేవాడినని అక్కడి పండితుడు వివరించారట. తన భార్యకు తన మంత్రి మీద ప్రేమ ఉండేదని, తనను యుద్ధంలో చంపించాలనే కుట్రతో భార్య అతన్ని రణరంగానికి పంపించిందని చెప్పారట. అయితే ఆ యుద్ధంలో ఎంతోమంది శత్రువులను చంపి తాను ప్రాణాలతో తిరిగి వచ్చానని, ఆ తర్వాత భార్య, మంత్రి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నానని సంజయ్ దత్ వివరించారు.
ఆ విషయం తెలిసిన తర్వాత కోపంతో తన భార్యను, మంత్రిని చంపేశానని, ఆ తర్వాత తీవ్ర పశ్చాత్తాపంతో రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. తాను పరమశివ భక్తుడినని, అడవిలో ఆహారం తీసుకోకుండా ఆకలితోనే ప్రాణాలు విడిచానని ఆ తాళపత్రాల్లో చెప్పినట్లు వెల్లడించారు. గత జన్మలో చేసిన పుణ్యం వల్లే ఈ జన్మలో మంచి కుటుంబంలో పుట్టి, మంచి సినీ కెరీర్‌ను సంపాదించుకున్నానని సంజయ్ దత్ నమ్ముతున్నారట. అదే సమయంలో గత జన్మలో చేసిన హత్యల పాపం కారణంగానే ఈ జన్మలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.
[SanjayDutt, SanjayDuttPreviousBirth, KoffeeWithKaran]





