Home

»

Bollywood News

సుశాంత్ చ‌నిపోయిన రోజే నటి సంచిత అనుమానాస్ప‌ద మృతి.. విచారణకు డిమాండ్!

Jun 16, 2026 7:44PM

బాలీవుడ్ బుల్లితెరపై తీవ్ర విషాదం అలముకుంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందనుకున్న యువ నటి సంచిత ఉగాలే (22) ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడటం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్నటివరకు కెమెరా ముందు నవ్వుతూ కనిపించిన ఈ మెరుపుతీగ, ఇంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ముంబైలోని నలసోపరా ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంచిత ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న అచోలే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం సమయంలోనే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

అయితే సంచిత మృతి వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే తేదీన (జూన్ 14) బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రోజున సంచిత కూడా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చనిపోవడానికి ఒకరోజు ముందే ఆమె 'ఇట్స్ అగైన్ 14 జూన్' (మళ్లీ జూన్ 14 వచ్చింది) అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పోస్ట్ చేయడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది.

పరిశ్రమలో ఉండే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్లే తన సోదరి ప్రాణాలు తీసుకుందని సంచిత సోదరుడు ఆకాశ్ ఆరోపించారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ కనబరిచిన సంచిత.. పాపులర్ హిందీ ధారావాహిక 'కుంకుమ భాగ్య'లో దియా టాండన్ పాత్రతో వీక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీనితో పాటు 'వాగ్లే కీ దునియా', 'దిల్‌వాలీ దుల్హా లే జాయేగీ' వంటి సీరియల్స్‌లో విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నటి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే సంచిత ఉగాలే మృతిపై పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరిపించాలని 'ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్' పోలీసులను డిమాండ్ చేసింది. నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల వెనుక ఉండే గ్లామర్ ప్రపంచపు చీకటి కోణాలు, ఒత్తిడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ డేటాతో పాటు కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సంచిత ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ పెద్దలు, తోటి నటీనటులు నివాళులర్పిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com