Home

»

Bollywood News

ఇండోనేషియాలో గాయ‌ప‌డిన బాలీవుడ్ న‌టి.. ముంబాయికి త‌ర‌లింపు.!

Oct 3, 2026 10:48AM

బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్ఛాకు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇండోనేషియాలోని బాలిలో వర్క్ కమ్ హాలిడే ట్రిప్‌లో ఉన్న ఆమెకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లు నటి టీమ్ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆమెను మెరుగైన చికిత్స కోసం ముంబైకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలను మాత్రం ఆమె టీమ్ వెల్లడించలేదు. 

ప్రమాదం తర్వాత నుష్రత్‌ను బాలిలోని ఆసుపత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరిన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం వెన్నెముకకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆమెను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. ముంబైలోని ఆసుపత్రికి చేరుకున్న నుష్రత్‌ను స్ట్రెచర్‌పై తరలిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇదిలా ఉంటే.. నుష్రత్ ఆరోగ్యమే ప్రస్తుతం తమ ప్రధాన ప్రాధాన్యత అని ఆమె టీమ్ పేర్కొంది. శస్త్రచికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకునేందుకు విశ్రాంతి అవసరమని తెలిపింది. గాయం, సర్జరీ కారణంగా రాబోయే కొన్ని వారాల్లో ఆమె వర్క్ కమిట్‌మెంట్స్ ప్రభావితమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమయంలో నటి ప్రైవసీని గౌరవించాలని అభిమానులు, మీడియాను కోరింది. 

మరోవైపు.. నుష్రత్ భరుచ్ఛా ఇటీవల పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె టైగర్ ష్రాఫ్‌తో కలిసి రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పష్మీనా రోషన్, అభిషేక్ బెనర్జీ, ఎల్విష్ యాదవ్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నుష్రత్ షూటింగ్, ఇతర కమిట్‌మెంట్స్ కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. 

‘ప్యార్ కా పంచ్‌నామా’, ‘సోను కే టిటు కీ స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’, ‘ఛోరీ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నుష్రత్‌ ప్రస్తుతం ముంబైలో చికిత్సకు సిద్ధమవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. 

 

 

 

[Nushrratt Bharuccha, Nushrratt Bharuccha Accident, Nushrratt Bharuccha Injury, Nushrratt Bharuccha Spine Fracture, Nushrratt Bharuccha Bali Accident, Nushrratt Bharuccha Air Ambulance, Nushrratt Bharuccha Surgery, Bollywood News, Nushrratt Bharuccha Health Update, Nushrratt Bharuccha Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com