Home

»

Bollywood News

కొత్త వివాదంలో కంగ‌నా రనౌత్.. న‌ర్స్‌ల యూనిఫామ్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు!

Jun 8, 2026 3:28PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్ ఎప్పుడు ఏ మాట్లాడినా అది సంచలనంగా మారడం సహజం. తాజాగా ఆమె నర్సింగ్ వృత్తి మరియు వారి యూనిఫామ్‌లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. సమాజంలో నర్సుల పట్ల ఉన్న దృక్పథాన్ని తప్పుబడుతూనే, ప్రస్తుతం వారు ధరిస్తున్న దుస్తులు ఇంకా బ్రిటిష్ కాలం నాటి బానిసత్వపు పోకడలను ప్రతిబింబిస్తున్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

కంగనా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నర్సింగ్ అనేది సమాజంలో అత్యంత ‘సెక్సువలైజ్’ (అతిగా శృంగారభరితంగా చూపించే) చేయబడిన వృత్తిగా మారిపోవడం బాధాకరమన్నారు. రాత్రింబవళ్లు రోగుల సేవలో తరిస్తూ, హాస్పిటల్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఈ ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సమాజంలో దక్కాల్సిన కనీస గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  అదే సమయంలో నర్సుల దుస్తుల విధానంపై కూడా కంగనా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. 

ప్రస్తుతం మన దేశంలో నర్సులు వాడుతున్న పిన్స్, క్యాప్స్, బెల్ట్స్ వంటివి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో అమెరికా నేవీ మరియు బ్రిటిష్ సంస్కృతి నుండి వచ్చినవని గుర్తు చేశారు. వైద్యులకు తమ దుస్తుల విషయంలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు, నర్సులకు మాత్రం వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అదే పాత విదేశీ శైలి దుస్తులను నిర్బంధించడం కరెక్ట్ కాదని, భవిష్యత్తులో దీనిని నర్సుల సౌకర్యాన్ని బట్టి ‘ఇండియనైజ్’ చేయాలని డిమాండ్ చేశారు.

కంగనా రనౌత్ ఈ చిత్రంలో ఒక సామాన్య హాస్పిటల్ నర్స్ పాత్రలో నటిస్తున్నారు. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో, కామా హాస్పిటల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి వందలాది మంది పేషెంట్లను ఎలా కాపాడారనే యథార్థ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెలబ్రిటీ హీరోలను మాత్రమే కాకుండా తెరవెనుక ఉండి దేశాన్ని కాపాడే వార్డ్ బాయ్స్, నర్సులు, వాచ్‌మెన్‌ల త్యాగాలను ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

బిర్లా స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాయి.  ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు నెటిజన్లు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ నర్సులకు మరింత గౌరవం ఇవ్వాలని అంటుండగా, మరికొందరు మాత్రం వృత్తిపరమైన యూనిఫామ్‌లను ఇలా వివాదాల్లోకి లాగడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వివాదాల నడుమ భారీ అంచనాలు నెలకొన్న కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com