Home

»

Bollywood News

షాకింగ్.. ‘డాన్ 3’ నుంచి తప్పుకున్న రణ్‌వీర్.. దర్శకుడికి భారీ అమౌంట్ రిటర్న్!

Apr 22, 2026

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కలయికలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. గత కొంతకాలంగా ఈ సినిమా నుంచి రణ్‌వీర్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఫర్హాన్ అక్తర్‌తో వచ్చిన విభేదాలను తొలగించుకునేందుకు రణ్‌వీర్ ఒక భారీ డీల్ కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న రణ్‌వీర్, ఇందుకోసం తాను తీసుకున్న అడ్వాన్స్‌లో సుమారు రూ. 10 కోట్లను ఫర్హాన్ అక్తర్‌కు తిరిగి చెల్లించేందుకు సిద్ధమయ్యారట. కేవలం నగదు రూపంలోనే కాకుండా, తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’లో ఫర్హాన్ అక్తర్ నిర్మాణ సంస్థకు వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ స్టెప్‌తో వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు పోషించిన ‘డాన్’ పాత్రలో రణ్‌వీర్ సింగ్‌ను చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రణ్‌వీర్ ప్లేస్‌లో హృతిక్ రోషన్ వస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ, ఇప్పటివరకు హృతిక్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు.

మరోవైపు, రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం తన కెరీర్ ప్లానింగ్‌లో భారీ మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘డాన్ 3’ వంటి భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను వదులుకున్నప్పటికీ, ‘ప్రళయ్’ వంటి కొత్త సినిమాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఆగిపోయినా, నిర్మాణ భాగస్వామిగా వీరి బంధం కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ‘డాన్ 3’ భవితవ్యం సందిగ్ధంలో పడింది. షారుఖ్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేసే సరైన హీరో కోసం ఫర్హాన్ అక్తర్ మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టారా లేదా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. రణ్‌వీర్ సింగ్ ఈ 10 కోట్ల రూపాయల డీల్‌తో వివాదాలకు స్వస్తి పలికినా, అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ హీరో ‘డాన్’గా కనిపించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com