Home

»

Bollywood News

19 ఏళ్ల త‌ర్వాత ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ సినిమాతో రీ-ఎంట్రీ.. గొంతు సమస్యను జయించిన సింగర్ దీపాలీ.!

Jul 2, 2026 6:58PM

జీవితంలో మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోతే అందులో కిక్ ఏముంటుంది? కొన్నిసార్లు విధి మనల్ని అధఃపాతాళానికి నెట్టేసినా, మనలో ఉన్న పట్టుదల, కసి మాత్రం మనల్ని మళ్లీ శిఖరాగ్రానికి చేరుస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథే గాయని దీపాలీ సహాయ్ జీవన ప్రయాణం. సుమారు 19 ఏళ్ల క్రితం ప్రముఖ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 3' లో అగ్రశ్రేణి కంటెస్టెంట్‌గా నిలిచి, తన మధురమైన గాత్రంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది దీపాలి. ఆ తర్వాత ఆమె పాపులారిటీని చూసి 'ఇండియన్ ఐడల్ సీజన్ 4' కి యాంకర్‌గా చేసే అవకాశం కూడా వెతుక్కుంటూ వచ్చింది. అయితే, అదే సమయంలో విధి ఆమె జీవితంలో ఒక పెద్ద తుఫానును సృష్టించింది. యాంకరింగ్, సింగింగ్ అంటూ విపరీతమైన శ్రమ చేయడం వల్ల ఆమె స్వరపేటిక తీవ్రంగా గాయపడింది. పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, ఆమె స్వరపేటిక నుండి రక్తం కారడం ప్రారంభమైంది. మాట్లాడటం కూడా కష్టతరంగా మారిన ఆ క్లిష్ట పరిస్థితుల్లో, వైద్యులు ఆమెను పరీక్షించి కోలుకోలేని షాక్ ఇచ్చారు. నువ్వు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పటికీ పాడలేవు అని  తేల్చిచెప్పేశారు. ఒక గాయనికి అంతకంటే మరణశాసనం మరొకటి ఉంటుందా?

కానీ, దీపాలి అక్కడితో కుంగిపోలేదు, గుండె నిండా ధైర్యాన్ని నింపుకుంది. గాయనిగా కెరీర్‌కు బ్రేక్ పడినా, సంగీతానికి తాత్కాలికంగా దూరం అయినా, తనలోని కళను చంపుకోలేదు. నటన వైపు దృష్టి సారించి పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతేకాదు, పుణేలోని ప్రతిష్టాత్మక 'ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్' లో చేరి ఏకంగా దర్శకత్వ శాఖలోనే శిక్షణ పొందింది. అయితే, ఆమె మనసంతా ఎప్పుడూ సంగీతం చుట్టూనే తిరిగేది. ఈ క్రమంలోనే ప్రముఖ గీత రచయిత బాబా అజ్మీ ఇచ్చిన ప్రోత్సాహం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మళ్లీ సాధన ప్రారంభించి, యూట్యూబ్ వేదికగా కవర్ సాంగ్స్, జానపద గీతాలను పాడుతూ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఆమె అకుంఠిత దీక్ష, నిరంతర కృషి ఊరికే పోలేదు. ఆమె విలక్షణమైన గాత్రం ఏకంగా ఆస్కార్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ బృందం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడే ఒక అద్భుతమైన దైవికమైన కాకతాళీయం జరిగింది. ఏఆర్ రెహమాన్ పుట్టినరోజైన జనవరి 6వ తేదీనే దీపాలి పుట్టినరోజు కూడా కావడం విశేషం. సరిగ్గా అదే రోజున రెహమాన్ బృందం ఆమెను చెన్నైకి ఆహ్వానించి, పాటను రికార్డ్ చేసింది.

ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన 'మై వాపస్ ఆవూంగా' చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'తేరే పాస్ మై' అనే బ్యూటిఫుల్ సాంగ్‌తో దీపాలి అద్భుతమైన రీ-ఎంట్రీ ఇచ్చింది. మూడు వారాల క్రితం విడుదలైన ఈ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటలో ఆమె గాత్రాన్ని విన్న సోనూ నిగమ్, విశాల్ మిశ్రా వంటి బాలీవుడ్ దిగ్గజ గాయకులు సైతం దీపాలి అసాధారణ ప్రతిభను, ఆమె కంబ్యాక్‌ను చూసి అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అసలు కెరీర్ ముగిసిపోయింది అనుకున్న స్టేజ్ నుండి, ఒక లైఫ్ చేంజింగ్ మ్యాజిక్‌ను సృష్టించి, లెజెండ్ ఏఆర్ రెహమాన్‌తో పనిచేయడం అనేది ఒక దైవికమైన అనుభూతి అంటూ దీపాలి ఎమోషనల్ అయ్యింది. పట్టుదల, నిరంతర సాధన ఉంటే కోల్పోయిన రాజ్యాన్ని అయినా తిరిగి ఎలా గెలుచుకోవచ్చో దీపాలి సహాయ్ ప్రయాణం నిరూపిస్తోంది.

 

 

 

Deepali Sahay, AR Rahman, Indian Idol singer Deepali, Mai Wapas Aaunga, Tere Paas Mai song, Deepali Sahay comeback

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com