బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఒకరైన అనన్య పాండే సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడి నటనపై, ఎంపిక చేసుకునే పాత్రలపై నెటిజన్లు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఒక శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడమే కాకుండా, పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది.
వివరాల్లోకి వెళితే.. అనన్య పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘చాంద్ మేరా దిల్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కథానుగుణంగా వచ్చే ఒక సన్నివేశంలో అనన్య భరతనాట్యం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆ సీన్‌లో ఆమె చేసిన నృత్య భంగిమలు, వింత హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాయి.
ఈ సన్నివేశంలో హీరో ఆమె నృత్యాన్ని చూసి పరవశించిపోవాల్సి ఉంటుంది. కానీ తెరపై అనన్య చేసిన గెంతులు, విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ చూసి ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. మన సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళను ఇంత హాస్యాస్పదంగా మారుస్తారా అంటూ నెటిజన్లు దర్శకుడు వివేక్ సోనిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది.
గతంలో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు గట్టిగానే గుర్తుండిపోయింది. ఆ చిత్రంలో ఆమె నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ‘చాంద్ మేరా దిల్’ సినిమాతోనైనా లక్ కలిసి వస్తుందని భావిస్తే, ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ‘కిల్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లక్ష్య లాల్వాని ఇందులో కథానాయకుడిగా నటించాడు. కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డ ఒక జంట, ఆ తర్వాత తమ లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్ళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్ర కథా నేపథ్యం మన హైదరాబాద్‌లోనే సాగడం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ డాన్స్ క్లిప్ వల్ల సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ వస్తున్నప్పటికీ, మరోవైపు సినిమాపై బజ్ పెరగడానికి కూడా కారణం అవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 'భరతనాట్యం చరిత్ర అనన్యతో ముగిసింది' అంటూ కొందరు నెటిజన్లు పెడుతున్న కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా, మొదటి వారాంతంలో ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. దాదాపు పదిహేను కోట్ల లోపే కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ, రాబోయే రోజుల్లో అయినా పుంజుకుంటుందో లేదో చూడాలి. ఏదేమైనా అనన్య పాండే క్లాసికల్ డాన్స్ వివాదం మాత్రం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.




