రణబీర్ ప్రపోజ్ చేసినప్పటి ఫొటోను రివీల్ చేసిన ఆలియా!
on Jun 28, 2022
ఆలియా భట్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కొత్త ప్రొఫైల్ పిక్చర్‌గా తన “ఇష్టమైన చిత్రం”ను ఎంచుకుంది. అది ఆలియాకు రణబీర్ కపూర్ ప్రపోజ్ చేసిన సమయంలో తీసిన రొమాంటిక్ చిత్రం. రణబీర్ కపూర్, ఆలియా భట్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ఆమె సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ వార్త ఇంటర్నెట్లో పత్యక్షమవడం ఆలస్యం, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహనటులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని గంటల తర్వాత, ఆలియా భట్ తన ఇన్స్టాగ్రామ్ DPని తనకు, రణబీర్‌కి ఫేవరేట్ ఫొటోతో మార్చుకుంది.
పరిశీలనగా చూస్తే, అది తమ సెలవుల్లో ఒకదానిలో ఆలియాకు రణబీర్ ప్రపోజ్ చేసిన క్షణాలకు చెందిన ఫొటో అని తెలుస్తుంది. ఆలియాను కౌగిలించుకున్న రణబీర్ చేతిలో రింగ్ బాక్స్ ఉండగా, ఆలియా అమితానందంతో నవ్వుతూ కనిపిస్తోంది.
ఈ ఫొటోను రణబీర్ తల్లి నీతూ కపూర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసి, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఫొటోతో పాటుగా, "గాడ్ బ్లెస్" అని రాసి, రెండు హార్ట్ ఎమోటికాన్లను జోడించింది. కామెంట్ సెక్షన్లో ఆలియా అనేక హార్ట్ ఎమోటికాన్లతో పాటు "నాకు ఇష్టమైన చిత్రం" అంటూ రియాక్టయింది.
అంతకు ముందు హాస్పిటల్ లో స్కాన్ చేయించుకుంటున్న ఫోటోను ఆలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె బెడ్ పక్కన రణ్ బీర్ కూడా కూర్చొని ఉన్నాడు. ఆ ఫోటోకి 'మా బేబీ త్వరలో వస్తోంది' అనే క్యాప్షన్ ని జోడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్నిహితుల సమక్షంలో ఆ జంట పెళ్లి చేసుకుంది. వారు తొలిసారిగా జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ' సెప్టెంబర్ 9న విడుదలవుతోంది.