Read more!

English | Telugu

షాకింగ్‌.. ‘సోలో లైఫే సో బెటర్‌’ అంటున్న యంగ్‌ హీరో!

ఈమధ్యకాలంలో సినిమా హీరోహీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎంతో టైమ్‌ తీసుకుంటున్నారు. హీరోలు నలభై దాటిన తర్వాత పెళ్లి పీటలెక్కుతుంటే, హీరోయిన్లు ముప్పై దాటిన తర్వాతగానీ పెళ్లిమాట ఎత్తడం లేదు. అలా లేట్‌గా అయినా లేటెస్ట్‌గా కొందరు పెళ్ళికి సిద్ధపడుతుంటే.. ఒక యంగ్‌ హీరో మాత్రం తను పెళ్ళి చేసుకోకూడదని డిసైడ్‌ అయ్యాడని, సోలో లైఫే సో బెటర్‌గా ఉందని అంటున్నాడు. ఆ హీరో ఎవరు? ఎందుకు పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు..

సినిమా మీద అభిరుచితో 50 షార్ట్‌ ఫిలింస్‌లో నటించిన రాజ్‌ తరుణ్‌కి డైరెక్టర్‌ అవ్వాలన్నది కల. అలా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరి కొన్ని సినిమాలకు పనిచేశాడు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రానికి స్క్రీన్‌ప్లే పాటు డైలాగ్స్‌ రాసే విషయంలోనూ పార్టిసిపేట్‌ చేశాడు. అయితే అదే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్‌ ఇవ్వడమే కాదు, తనూ షాక్‌ అయ్యాడు. ఎందుకంటే డైరెక్టర్‌ అవ్వాలని వచ్చి హీరో అయ్యాడు కాబట్టి. మొదటి సినిమాతోనే హీరోగా సక్సెస్‌ అయ్యాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించినా కొన్ని సినిమాలు మాత్రం అతన్ని నిరాశపరిచాయి. ఇప్పుడు పురుషోత్తముడు, భలే ఉన్నాడే, తిరగబడరా సామీ సినిమాల్లో నటిస్తున్నాడు. 

రాజ్‌ తరుణ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఆమధ్య వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి విషయంలో అతను తీసుకున్న నిర్ణయానికి అందరూ షాక్‌ అవుతున్నారు. జీవితంలో అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట. జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలని డిసైడ్‌ అయినట్టు చెబుతున్నాడు. పెళ్ళి, పిల్లలు వంటి విషయాలపై తనకు ఆసక్తి లేదని అంటున్నాడు. పెళ్ళి విషయాన్ని రాజ్‌కే వదిలేసారట వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని చెప్పేదట. ఇప్పుడు నీ పెళ్లి నీ ఇష్టం అని అతన్ని వదిలేశారట. అయితే తనకు మాత్రం ఒంటరిగా ఉండడమే బాగుందని, తన పెళ్ళి గురించి ఇంట్లో కూడా ప్రస్తుతం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశాడు.  

రాజ్‌ తరుణ్‌ వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలే. ఈ వయసులోనే పెళ్ళి విషయంలో ఒక నిర్ధారణకు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో 32 అనేది చాలా చిన్న వయసు కిందే లెక్క. కాబట్టి భవిష్యత్తులో తన నిర్ణయం మార్చుకొని పెళ్లి వైపు అడుగులు వేసే విషయంలో రాజ్‌ తరుణ్‌ ఆలోచనలో మార్పు వస్తుందేమో చూడాలి.