Read more!

English | Telugu

‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్‌.. అల్లరి నరేష్‌ బ్యాక్‌ టు కామెడీ!

రాజేంద్రప్రసాద్‌, ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అప్పట్లో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడదే టైటిల్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇ.వి.వి. తనయుడు అల్లరి నరేష్‌ హీరోగా కొత్త దర్శకుడు మల్లి అంకం రూపొందించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మరోసారి ఆడియన్స్‌ని నవ్వించేందుకు రాబోతోంది. ఆమధ్య అల్లరి నరేష్‌ కామెడీ సినిమాలను వరసగా చేసి అలరించాడు. కామెడీకి గ్యాప్‌ ఇచ్చి కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌ చేశాడు. ఇప్పుడు తనకెంతో పేరు తెచ్చిన కామెడీ ట్రాక్‌లోకి ఈ సినిమా ద్వారా వెళుతున్నాడు. 

‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ట్రైలర్‌ని నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. మే 3న ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ట్రైలర్‌లోనే ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏమిటో అర్థమైంది. పెళ్ళి చేసుకోవడమే హీరో లక్ష్యంగా కనిపిస్తోంది. దాని చుట్టూనే కథ తిరుగుతుందని వేరే చెపక్కర్లేదు. తనకు సరిపోయే అమ్మాయి కోసం మ్యాట్రిమోనికి వెళ్ళడం, ఆ తర్వాత కొంతమందిని చూడడం, 49 సార్లు రిజెక్ట్‌ అవ్వడంతో ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతుంటాడు హీరో. అమ్మాయి కోసం వెతికే క్రమంలో జనరేట్‌ అయ్యే కామెడీ సినిమా మొత్తం ఉంటుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

పెళ్ళి ప్రయత్నాల్లో భాగంగానే పరిచయం అయిన ఫరియా అబ్దుల్లాతో పరిచయం, ప్రేమ అనే అంశాలను కూడా చూపించారు. పెళ్ళి చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న హీరోకి ఫరియా పరిచయం వల్ల ఏర్పడిన పరిస్థితులు ఏమిటి? అనేది సినిమాలో చూపించే అవకాశం కనిపిస్తోంది. ప్రజెంట్‌ జనరేషన్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిల పెళ్ళిళ్లు చెయ్యడమే కష్టం అనే డెసిషన్‌కి అందరూ వచ్చేశారు. అందుకే దర్శకుడు ఈ పాయింట్‌ని ఎంపిక చేసుకున్నాడనిపిస్తుంది. అయితే దాన్ని ఎంటర్‌టైనింగ్‌ వేలో చూపించే ప్రయత్నం చేశాడు. కామెడీ చేయడం నరేష్‌కి కొత్త కాదు కాబట్టి ట్రైలర్‌లో చూపించిన కామెడీ సీన్స్‌లో ఎప్పటిలాగే బెస్ట్‌ అనిపించుకున్నాడు. ఈ ట్రైలర్‌లో కనిపించిన వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, షకలక శంకర్‌ సీన్స్‌ కూడా నవ్వించాయి. ‘అందుకేగా, మాంగల్యం తంతునేనా అన్నారుగానీ, తొందరేనా అన్లేదు’, ‘మాలాంటి పెళ్ళికాని వారికి వీలైతే పెళ్ళి సంబంధం చూసి పెట్టమని చెప్పండి.. పెళ్ళెప్పుడు పెళ్లెప్పుడు అని దొబ్బే వాళ్ళని ఓ కొత్త సెక్షన్‌ పెట్టి లోపలేయించండి.. ప్లీజ్‌’ వంటి డైలాగ్స్‌ కొత్తగా ఉన్నాయి. 

సూర్య కెమెరా వర్క్‌ బాగుంది. గోపీసుందర్‌ పాటలు హుషారుగా ఉన్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఒక కామెడీ సినిమాకి ఉండాల్సిన రేంజ్‌లోనే ఉంది. ఈ సినిమాకి అబ్బూరి రవి రాసిన డైలాగ్స్‌ ప్లస్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అల్లరి నరేష్‌ బ్యాక్‌ టు కామెడీ అనేలా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్‌ ఉంది.