English | Telugu

బన్నీకి ఏమైంది.. ఎందుకీ గందరగోళం!

బన్నీకి ఏమైంది.. ఎందుకీ గందరగోళం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న తీరు అద్భుతం. 'పుష్ప-1'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించిన ఆయన ప్రస్తుతం 'పుష్ప-2'లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో బన్నీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే 'పుష్ప-2' తర్వాత ఆయన.. డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, మరో కొత్త ప్రాజెక్ట్ విషయంలోనే బన్నీ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎలాంటి కథ చేయాలి, ఏ దర్శకుడితో చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నాడో లేక ప్రస్తుతం తన పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తున్నాడో తెలీదు కానీ.. ఆయన కొత్త సినిమాల విషయంలో ఫ్యాన్స్, మీడియా వర్గాలు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాల గ్యాప్ లో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ చేస్తాడని.. దానికి బోయపాటి శ్రీను లేదా అట్లీ దర్శకత్వం వహిస్తారని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత బోయపాటి పేరు పక్కకెళ్లి, అట్లీ పేరు ప్రధానంగా వినిపించింది. బన్నీ-అట్లీ కాంబోలో సినిమా ఖాయమని, రేపో మాపో ప్రకటనే అన్నట్టుగా ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో సడెన్ గా మరో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. నెల్సన్ రాకతో, అట్లీ ప్రాజెక్ట్ అటకెక్కిందని న్యూస్ వినిపించాయి. అక్కడితో అయిపోలేదు. ఇంతలోనే మరో ట్విస్ట్. తాజాగా బన్నీ అనూహ్యంగా ముంబైలో అట్లీని మీట్ అయ్యాడు. వీరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబోలో ప్రాజెక్ట్ ఖరారైందని అంటున్నారు. ఇలా రోజుకో మలుపుతో బన్నీ కొత్త ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో అనే గందరగోళం నెలకొంది. గతంలోనూ ఇలాగే బన్నీతో సినిమా అంటూ పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. మరి ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.