English | Telugu

‘నువ్వా? నేనా?’.. ఈ ఎపిసోడ్ ఎప్పటికి ఫినిష్ అయ్యేను?

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లోని టాప్ హీరోలు కమిట్ అయిన సినిమాలు, వారు నెక్స్‌ట్ చేయబోయే సినిమాల విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఒక హీరో, డైరెక్టర్ కమిట్ అయిన సినిమా సెట్స్ పైకి వెళ్లేవరకు నమ్మకం ఉండడం లేదు. అలాంటి ఓ ఎపిసోడ్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల మధ్య రకరకాల ట్విస్టులతో నడుస్తోంది. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చేసే హీరో ఎవరు అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

త్రివిక్రమ్ ఇప్పటివరకు చేయని మైథాలజీ జోనర్‌లో గాడ్ ఆఫ్ వార్ చిత్రం చేయబోతున్నారన్న వార్త కొన్నాళ్ల క్రితం బయటికి వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా ఆ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇంతకుముందే వీరిద్దరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలూ మంచి విజయం సాధించాయి. ఆల్రెడీ హ్యాట్రిక్ సాధించిన ఈ కాంబోలో డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడుతూ ఓ సినిమా చెయ్యాలనుకున్నారు. అదే గాడ్ ఆఫ్ వార్.

ఇలా ఉండగా.. ఈ ప్రాజెక్ట్ సడన్‌గా అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్‌కి షిఫ్ట్ అయింది. అది నిజమేనన్నట్టు మురుగన్ బుక్ చేతిలో పట్టుకొని పలుమార్లు ఎన్టీఆర్ కనిపించారు. ఆ తరహా సినిమాకి ఎన్టీఆర్ పూర్తి యాప్ట్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే కథ మళ్లీ మొదటికి వచ్చినట్టుగా ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ వైపు వెళ్లింది. కానీ, బన్నీ ఇప్ప్పుడున్న పొజిషన్‌లో ఈ సినిమా చేయడానికి ఎంత వరకు వీలవుతుంది అనేది సందేహమే. ఎందుకంటే బన్నీ కమిట్ అయిన సినిమాలు, కమిట్ కావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.

ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. లోకేష్ కనకరాజ్‌తో కలిసి సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. సందీప్‌రెడ్డి వంగా, సంజయ్ లీలా భన్సాలి వంటి డైరెక్టర్లు బన్నీతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌తోనే గాడ్ ఆఫ్ వార్ ఉంటుందని హింట్ ఇచ్చారు బన్నీవాసు. ఇక బన్నీతో సినిమా కన్‌ఫర్మ్ అనుకుంటుండగానే మళ్లీ ఈ ప్రాజెక్ట్‌కి తారక్‌కి వెళ్లిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా పూర్తయ్యే సమయానికి, వెంకటేష్‌తో త్రివిక్రమ్ చేస్తున్న ఆదర్శకుటుంబం కూడా ఫినిష్ అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్‌తోనే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఉంటుందనే వార్త బలంగా వినిపిస్తోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలే తప్ప అఫీషియల్‌గా త్రివిక్రమ్ సినిమా ఎవరు చేస్తారు అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇన్ని మలుపులు తిరుగుతున్న గాడ్ ఆఫ్ వార్ ఎపిసోడ్ ఎప్పటికి ఫినిష్ అవుతుందో చూడాలి.