Read more!

English | Telugu

'టిల్లు స్క్వేర్' మూవీ రివ్యూ

సినిమా పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి, మురళీధర్‌ గౌడ్‌, ప్రిన్స్, మురళి శర్మ, తదితరులు
సంగీతం(పాటలు): రామ్ మిరియాల, అచ్చు రాజమణి
నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీఓపీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్: నవీన్ నూలి
రచన: సిద్ధు జొన్నలగడ్డ, మల్లిక్‌ రామ్
దర్శకత్వం: మల్లిక్‌ రామ్ 
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్
విడుదల తేదీ: మార్చి 29, 2024

ఒక హిట్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం సహజం. ఇటీవల కాలంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సీక్వెల్ అంటే 'టిల్లు స్క్వేర్' అని చెప్పవచ్చు. 2022 లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై, థియేటర్లలో నవ్వులు పూయించి, ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. మరి ఈ 'టిల్లు స్క్వేర్' ఎలా ఉంది? 'డీజే టిల్లు' మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
గతంలో రాధిక(నేహా శెట్టి)ను ప్రేమించి మోసపోయి, హత్య కేసులో ఇరుక్కున్నప్పటికీ టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) తీరు మారలేదు. ఓ వైపు ఈవెంట్స్ చేసి డబ్బులు సంపాదిస్తూనే, మరోవైపు అమ్మాయిలకు ప్రేమ పాఠాలు చెబుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక పార్టీలో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్)ని చూసి ప్రేమలో పడతాడు. కలిసిన కొద్దిసేపటికే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. శారీరికంగా కూడా కలుస్తారు. ఆ తర్వాత లిల్లీ ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది. అక్కడి నుంచి టిల్లు జీవితం రకరకాల మలుపులు తిరుగుతుంది. అసలు లిల్లీ ఎవరు? ఆమె రాకతో టిల్లు జీవితంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? గతంలో రాధిక కారణంగా హత్య కేసులో ఇరుక్కున్న టిల్లు.. ఈసారి లిల్లీ కారణంగా ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు? ఆ సమస్య నుండి టిల్లు ఎలా బయటపడగలిగాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఒకసారి జరిగిన మ్యాజిక్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అందుకే 'డీజే టిల్లు' సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడం సాధ్యమేనా? అనే అనుమానం వ్యక్తమైంది. మూవీ టీం మీద కూడా ఆ ఒత్తిడి పడింది. అందుకే రీ రైట్ లు, రీ షూట్ లు అంటూ కాస్త ఎక్కువ సమయమే తీసుకుంది. అయితే వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందనే చెప్పవచ్చు. ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయగలిగారు.

గత కొన్నేళ్లలో ప్రేక్షకులకు బాగా చేరువైన పాత్రల్లో 'డీజే టిల్లు' ఒకటి అనడంలో సందేహం లేదు. టిల్లు చేష్టలు, మాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని టిల్లు పాత్ర నుంచి ప్రేక్షకులు ఎలాంటి వినోదం ఆశిస్తారో.. ఆ వినోదాన్ని అందించడంలో మూవీ టీం సక్సెస్ అయింది. 

కథగా చూసుకుంటే 'టిల్లు స్క్వేర్'లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. 'డీజే టిల్లు' తరహాలోనే హీరో క్యారెక్టరైజేషన్ ప్రధానంగానే సినిమా సాగుతుంది. టిల్లు పాత్ర పరిచయం, టిల్లు-లిల్లీ ప్రేమ కథ, అక్కడక్కడా 'డీజే టిల్లు' రిఫరెన్స్ లు వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ మెప్పించింది. ఈసారి టిల్లు ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కోబోతున్నాడు అనే ఆసక్తిని కలిగిస్తూ ఫస్టాఫ్ ని ముగించారు.

'డీజే టిల్లు' సినిమాలో ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త కామెడీ డోస్ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి చిత్ర బృందం సెకండాఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఫస్టాఫ్ లో అక్కడక్కడా మాత్రమే నవ్వుకునే ఆడియన్స్.. సెకండాఫ్ లో ఎక్కువసార్లు నవ్వుకుంటారు. టిల్లు వన్ లైనర్స్, టిల్లు-లిల్లీ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాసేపు హాయిగా నవ్వుకున్నామనే ఫీలింగ్ ని ఆడియన్స్ లో కలిగించడంలో చిత్ర బృందం విజయం సాధించింది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు, 'డీజే టిల్లు' రిఫరెన్స్ లు మరీ ఎక్కువయ్యాయనే అభిప్రాయం కలుగుతుంది. 

సిద్ధు జొన్నలగడ్డ సంభాషణలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఆ సంభాషణలే థియేటర్లలో నవ్వులు పూయించాయి. 'డీజే టిల్లు' విమల్‌కృష్ణ దర్శకుడు కాగా, సీక్వెల్ కి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించాడు. దర్శకుడు మారిన ప్రభావం 'టిల్లు స్క్వేర్'పై పడలేదు. టిల్లు పాత్రలోని ఆత్మను పట్టుకొని ప్రేక్షకులను అలరించడంలో మల్లిక్ రామ్ సక్సెస్ అయ్యాడు.

సాంకేతికంగా 'టిల్లు స్క్వేర్' ఉన్నతంగా ఉంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరపరిచిన పాటలు బాగున్నాయి. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా పనితనం మెప్పించింది. నవీన్ నూలి ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి

నటీనటుల పనితీరు:
'డీజే టిల్లు' విజయంలో సిద్ధు జొన్నలగడ్డ ది కీలక పాత్ర. తనదైన మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' లో కూడా అదే స్థాయిలో చెలరేగిపోయాడు. తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో టిల్లు పాత్రలో తనని తప్ప ఎవరినీ ఊహించుకోలేనంతగా ఒదిగిపోయాడు. ఇక అనుపమ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తనదైన నటనతో లిల్లీ లాంటి బోల్డ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. టిల్లు తండ్రిగా మురళీధర్‌ గౌడ్‌ ఉన్నంతలో బాగానే నవ్వించాడు. రాధికగా నేహా శెట్టి అతిథి పాత్రలో మెరిసి సర్ ప్రైజ్ చేసింది. ఇది హీరో క్యారెక్టరైజేషన్ ప్రధానంగా సాగే సినిమా కావడంలో మిగతా పాత్రలు మొక్కుబడిగానే ఉన్నాయి. 

ఫైనల్ గా...
స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ పట్టించుకోకుండా కాసేపు హాయిగా నవ్వుకోవాలి అనుకున్నవాళ్ళు ఈ సినిమాకి హ్యాపీగా వెళ్లొచ్చు. 'డీజే టిల్లు' సినిమాని నచ్చిన వారు.. దానికి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్'ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్: 2.75/5 

- గంగసాని