English | Telugu
పవన్ కోసం చక్రం తిప్పుతున్న సురేష్ బాబు
Updated : Dec 13, 2014
నిర్మాత డి.సురేష్ బాబు ది మాస్టర్ బ్రెయిన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎత్తుకు ఎవరైనా సరే చిత్తయిపోవాల్సిందే. తన సినిమా విడుదల అయ్యేటప్పుడు మాత్రం ఆయన బుర్ర మరింత చురుగ్గా కదులుతుంది. గోపాల గోపాలకు పోటీ లేకుండా చేసేందుకు.. ఆయన ఇప్పుడు పావులు కదుపుతున్నారు. ఈసంక్రాంతికి గోపాల గోపాల విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, వెంకటేష్ కథానాయకులుగా నటించారు. పవన్ సినిమాకి గట్టి పోటీ ఇచ్చే చిత్రం `ఐ`. ఇది కూడా సంక్రాంతికే వస్తోంది. శంకర్ సినిమా అనగానే.. తెలుగు ప్రేక్షకులూ ఆసక్తి చూపిస్తారు. సో.. గోపాల గోపాల - ఐ సినిమాల మధ్య గట్టి పోటీ ఎదురుకానుంది. ఐ బాగున్నా, బాగోక పోయినా ఆ ఎఫెక్ట్ మాత్రం గోపాలపై పడుతుంది. కాబట్టి... ఐని పోటీ నుంచి తప్పించేందుకు సురేష్‌బాబు తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. అసలు అనువాద చిత్రాలు మన పండక్కి ఎలా విడుదల అవుతాయ్?? అనేది ఆయన లేవనెత్తుతున్న పాయింటు. తమిళ ఇండ్రస్ట్రీలో ఓ రూల్ ఉంది. అదేంటంటే తమిళనాట పండుగ సినిమాలు వచ్చినప్పుడు.. అనువాద చిత్రాలు ఆడకూడదు. తెలుగు లో తీసిన సినిమాలు తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తే.. వాళ్లు ఒప్పుకోరు. థియేటర్లు దొరకవు. తమ సినిమాలకు పరాయి భాషా చిత్రం అడ్డురాకూడదని తమిళ ఇండ్రస్ట్రీ తీసుకొన్న జాగ్రత్త అది. ఈ పాయింటే సురేష్‌బాబుకి వరం కానుంది. ఇదే పాయింటు లేవనెత్తి ఐ సినిమాని అడ్డుకొనేందుకు చూస్తున్నారాయన. ''ఏ పండక్కీ మన సినిమాలు తమిళనాట ఆడవు, మరి మన పండక్కి తమిళ చిత్రాలు ఎలా చూస్తాం?'' అని ఆయన ప్రశ్నిస్తున్నారట. మరో వైపు బండ్ల గణేష్ కూడా సురేష్ బాబుని సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. ఆయన తన టెంపర్‌ని రిలీజ్ చేయబోతున్నారు కదా. బడా నిర్మాతలంతా కలిశారన్నమాట. అంటే తెర వెనుక ఐని అడ్డుకొనేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయన్నమాట. ఏం జరుగుతుందో చూడాలి.