Read more!

English | Telugu

వాళ్ళ మధ్య ఆ పాలిటిక్స్ ఎందుకో తెలీదు!

కంటెంట్ ఉంటే చాలు కటౌట్‌తో పెద్ద పని లేదు అని ఆ కాలంలోనే నిరూపించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రమోహన్. "పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడే ఆ సినిమా హిట్టవుతుంది" అన్నారు చంద్రమోహన్. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను వివరించారు. 

"ఆ రోజుల్లో రామారావు గారి పక్కన నటిస్తే నాగేశ్వరావు గారి పక్కన ఛాన్సెస్ రావు.. నాగేశ్వరావు గారి పక్కన నటిస్తే రామారావు గారి పక్కన ఛాన్సెస్ రావు అనే టాక్ ఉండేది. అప్పట్లో వీళ్ళ ఇద్దరి మధ్య చాలా పాలిటిక్స్ నడిచేవి.. నాకు మొదట్లో తెలిసేది కాదు కానీ తర్వాత బయట కొంతమంది చెప్పారు. అలా తర్వాత ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూడా వేరువేరుగా ఉండేవాళ్ళు. ఎవరి బిల్డప్ వాళ్ళది అన్నట్టుగా ఉండేది. అందుకే ఎవరో ఒకరి దగ్గరే వేషాలు వేయమని చెప్పారు. ఐతే అప్పుడు ఇద్దరి పక్కనా ఎలాంటి కాంట్రవర్సీ  లేకుండా నటిస్తోంది సత్యనారాయణ మాత్రమే." అని చెప్పారు చంద్రమోహన్. 

ఆయన నాగేశ్వరావుని నమ్ముకున్నారు. "అందుకే రామారావు పక్కన నాకు రెండు ఆఫర్స్ తప్ప ఎక్కువగా ఏమీ రాలేదు. వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండేదేమో.. లేదా ఎవరైనా ఇద్దరి మధ్య పొసగకుండా చేసేవారో తెలీదు కానీ ఇద్దరూ బయట మంచి ఫ్రెండ్స్.. మా అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చిన ఆదర్శ పురుషులు. శ్రీదేవిని అప్పట్లో ఐరెన్ లెగ్ అనేవారు. అలాంటి టైములో నా పక్కన చేసేసరికి స్టార్ హీరోయిన్ ఐపోయింది. దాంతో శ్రీదేవి, వాళ్ళ అమ్మ ఇద్దరూ నా గురించి చెప్పడం మొదలుపెట్టారు. అలా నాతో 30, 40 మంది కొత్త అమ్మాయిలు నటించారు. స్టార్ హీరోయిన్స్ ఐపోయారు. దాంతో గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అని నాకు పేరు పెట్టేసారు." అని చెప్పుకొచ్చారు చంద్రమోహన్.