English | Telugu

రౌడీ ఫెలో రివ్యూ

నీకేం వ‌చ్చు అన్న‌ది కాద‌న్న‌య్యా.
జ‌నానికి ఏం న‌చ్చుతుందో... అదే ముఖ్యం!

ఈ పాయింట్ అర్థం చేసుకొంటే చాలు. ఈ రోజు సినిమాని నిక్షేపంగా న‌డిపించేయొచ్చు. కానీ కొంత‌మంది ద‌ర్శ‌కులు మాట విన‌రు. కొత్త ద‌ర్శ‌కులైతే అస్స‌లు విన‌రు. త‌మ‌కేం వ‌చ్చో, ఏం నేర్చుకొన్నారో అవ‌న్నీ బ‌య‌ట‌పెట్టేద్దామ‌న్న తాప‌త్ర‌యం ఎక్కువ క‌నిపిస్తుంది. రౌడీ ఫెలో సినిమా చూస్తే మీరూ అదే మాటంటారు. ఈ సినిమాతో గీత ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య మెగా ఫోన్ ప‌ట్టాడు. ఎన్నాళ్ల నుంచి క‌ల‌లు కంటున్నాడో గానీ... త‌న త‌ప‌న‌, త‌న క్రియేటివిటీ, తన టాలెంట్ అంతా ఈ సినిమాలోనే గుమ్మ‌రించేద్దాం అన్న ప్ర‌య‌త్నం క‌నిపించింది. అదే ఈ సినిమాకి 'శాపం'లా మారుతుంద‌ని అస్స‌లు అనుకోలేదు. అస‌లింత‌కీ... రౌడీ ఫెలో ఎలా ఉంది? కొత్త ద‌ర్శ‌కుడు ఏం చేశాడు? నారా రోహిత్‌కి ఇది ఎంత వ‌ర‌కూ ప్ల‌స్ ?? చూద్దాం రండి.

రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్) మంచోడే. కానీ బాగా ఈగోయిస్ట్‌. ఏదోలా త‌న‌ ఈగోని సంతృప్తి పరచుకోవాల‌ని చూసేటోడు. నాలుగేళ్ల క్రితం నా కాల‌ర్ ప‌ట్టుకొన్నావ్ తెల్సా..? అంటూ గుర్తు చేసి మ‌రీ.. రెండు పీకుతాడు. పోతూ పోతూ ల‌క్ష రూపాయ‌లు మొహం మీద కొట్టి వెళ్తాడు. అదే ఈగోతో ఎస్పీ (ఆహుతి ప్ర‌సాద్‌)తో గొడ‌వ పెట్టుకొంటాడు. ఆ ఎస్పీతో చెడుగుడు ఆడుకోవాల‌ని ఎస్ ఐ పోస్టుని రూ.50 ల‌క్ష‌ల‌కు కొనేస్తాడు. అదే ఊర్లో దుర్గా ప్ర‌సాద్ (రావు రమేష్‌) దుర్మార్గాలెన్నో చేస్తుంటాడు. త‌న‌కేమో మంత్రి కావాల‌ని ప‌ట్టు. దుర్గా ప్ర‌సాద్‌కీ ఈగో ఎక్కువే. ఓ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసుని సీరియ‌స్‌గా తీసుకొన్న రానా ప్ర‌తాప్‌కి కొన్ని నిజాలు తెలుస్తాయి. అక్క‌డి నుంచి... త‌న ప్ర‌యాణం మారుతుంది. ఇంత‌కీ అవేంటి..?? దుర్గా ప్ర‌సాద్‌కీ, రానా ప్ర‌తాప్‌కీ గొడ‌వ ఎలా మొద‌లైంది..? ఇద్ద‌రి ఈగో ప్రాబ్ల‌మ్స్ వ‌ల్ల ఈ క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అనేదే రౌడీ ఫెలో సినిమా.

రామాయ‌ణ భార‌తాలు, ఇతిహాస యుద్దాలకు కార‌ణం ఈగోలే.. అనే ఓ మాట హీరో చేత చెప్పించారు. ఆ ఈగోతోనే ఈ క‌థ మొద‌ల‌వుతుంది. నిజానికి ద‌ర్శ‌కుడు కొత్త పాయింట్‌ని ప‌ట్టుకొన్నాడు. ఈగోలున్న ఇద్ద‌రు తెలివైన వాళ్లు ఢీ కొట్టుకొంటే ప‌రిస్థితి ఏంటి?? అన్న‌దే ఆ పాయింట్‌. సినిమా ప్రారంభం, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, ఎస్ ఐ పోస్టు కొనేయ‌డం... ఇలాంటి సీన్స్ అన్నీ కొత్త‌గానే సాగాయి. స‌ర‌దాగానూ ఉన్నాయి. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ క‌థానాయ‌కుడికి ల‌క్ష్యం లేదు. ల‌క్ష్యం తెలిశాక‌.. సినిమాలో క‌థ‌లేదు. అంతే తేడా..! ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు అల్లుకొన్న (కొన్ని) సీన్స్ బాగుండ‌డం, కామెడీ పండ‌డంతో చ‌ల్తా! ఆ త‌ర‌వాత చెప్పాల‌నుకొన్న విష‌యాలు ఎక్కువైపోయి, క‌థ‌లో బేస్ లేక‌పోవ‌డంతో దాడి త‌ప్పింది. అస‌లు ద‌ర్శ‌కుడు ఏ దారిలో వెళ్తున్నాడో, ఈ క‌థ‌తో ఏం చెప్పాల‌నుకొంటున్నాడో అర్థం కాలేదు. క్లైమాక్స్‌లో హీరో, విల‌న్ల మ‌ధ్య ప‌దినిమిషాల పాటు డైలాగుల‌ను న‌డిపించి కాల‌క్షేపం చేశాడు. ఆ డైలాగులు బాగున్నా.. అందులో ఉన్న డెప్త్‌కి ఈ క‌థ స‌రిపోలేదు. చివ‌రికి క‌థానాయ‌కుడి చేతే శ‌త్రుసంహారం చేయించి.. అంద‌రి బాట‌లోనే న‌డిచాడు ద‌ర్శ‌కుడు.

దర్శ‌కుడిలో ఫైర్ ఉంది. కొత్త‌గా చెప్పాల‌న్న త‌ప‌న ఉంది. కాక‌పోతే త‌న‌కు తెల్సిందంతా చెప్పేయాల‌నుకొన్నాడు. అక్క‌డే ఈ సినిమా ప‌ట్టు త‌ప్పింది. ఎక్కువ విష‌యాలు ప్ర‌స్తావించ‌డం,వాటికి క‌థ‌తో సంబంధం లేక‌పోవ‌డం ప్ర‌ధాన‌మైన లోపం. పైగా సినిమా చాలా స్లోగా ఉంది. ప్ర‌తీ విష‌యాన్నీ డిటైల్డ్‌గా చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు టైమ్ తీసుకొన్నాడు. తొలుత బాగానే ఉన్నా, త‌ర్వాత‌ర్వాత న‌స అనిపిస్తుంది. ద్వితీయార్థం మ‌రీ స్లో. క‌థానాయికకి ప్రాధాన్యం లేదు. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర్లేదు. దాంతో రొమాన్స్ త‌గ్గింది.

రోహిత్ చూడ్డానికి బాగున్నాడు. మ‌రీ బొద్దుగా క‌నిపించ‌డం ఇబ్బంది. త‌న బ‌లం డైలాగులు ప‌ల‌క‌డం. ఈ సినిమాతో అది మ‌రోసారి నిరూపిత‌మైంది. కొన్నీ సీన్స్‌లో బాగా చేశాడు. కాక‌పోతే అర్జెంటుగా బ‌రువు త‌గ్గాలి. లేదంటే రాన్రానూ చూడ‌డం క‌ష్టం. విశాఖ సింగ్ గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు. న‌ట‌న‌, గ్లామ‌ర్‌.. రెండింటిలోనూ మార్కులు తెచ్చుకొదు. `హీరోయిన్ వ‌స్తే బాగుణ్ణు` అనుకొనేవాడు కూడా `విశాఖ ఎప్పుడు మాయ‌మ‌వుతుందా?` అని ఎదురుచూస్తుంటాడు. అంత టార్చ‌ర్ పెట్టింది. రావు ర‌మేష్ మంచి న‌టుడు. త‌న‌కంటూ ఓ శైలి ఉంది. రావు గోపాల్రావుని ఇమిటేట్ చేయ‌క్క‌ర్లెద్దు. ఆహుతి ప్ర‌సాద్ మెప్పించాడు. పోసానిది రొటీన్ కామెడీనే. స‌త్య‌ని చూస్తుంటే సునీల్ గుర్తొస్తున్నాడు. కావాల‌ని అలా న‌టించాడో, లేదంటే బాడీ లాంగ్వేజే అంతో అర్థం కాదు.

స్వామి రారాతో స‌న్నీ ఆక‌ట్టుకొన్నాడు. ఆ సినిమాలోని ట్యూనే య‌ధాత‌ధంగా వాడుకొన్నారు. ఒక‌సారి కాదు.. రెండు పాటల్లో. స‌న్నీ నేప‌థ్య సంగీతం బాగుంది. కెమెరా ఎక్స‌లెంట్‌. ఎటిట‌ర్ ఇంటి ద‌గ్గ‌ర క‌త్తెర మ‌ర్చిపోయి ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూర్చున్న‌ట్టు అనిపించింది. ద‌ర్శ‌కుడికి ఇదే తొలి చిత్రం. క‌థ‌నం ఇబ్బందిగా ఉంది. నిజానికి ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొద‌లు పెట్ట‌కుండా స్ట్ర‌యిట్‌గా చెప్పొచ్చు. సంభాష‌ణ‌లు మాత్రం బాగున్నాయి. క‌నీసం ప‌ది డైలాగులైనా గుర్తు పెట్టుకోవ‌చ్చు. నిర్మాణ విలువ‌ల‌కు వంక పెట్ట‌లేం.చిన్న చిన్న లోపాలు రౌడీ ఫెలోని వెన‌క్కి లాగాయి. చాలా చెప్పాల‌నుకొన్న తాప‌త్ర‌యంతో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డి అస‌లు విష‌యం చెప్ప‌కుండా దాన్ని మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన‌ట్టు అనిపించింది.


రేటింగ్ 2.5/5