Read more!

English | Telugu

"ఒక మనసు" మూవీ డైరెక్టర్ రామరాజు ఇంటర్వ్యూ

ప్రేక్షకులకు గుర్తుండేవి ప్రేమకథలు మాత్రమే!

-దర్శకుడు రామరాజు

దర్శకుడిగా ప్రతి ఒక్కరూ ప్రేక్షకులపై తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా తన మొదటి చిత్రమైన "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు" సినిమాతో "క్లాస్ డైరెక్టర్"గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు రామరాజు. ఆయన వ్యవహార శైలిలాగే ఆయన సినిమాలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం "ఒక మనసు". మెగా డాటర్ నీహారిక కొణిదెల ఈ చిత్రం ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీవి9తో కలిసి మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రామరాజు సినిమా విశేషాలను, "ఒక మనసు" కథకు ఇన్స్పిరేషన్ ఏమిటి? వంటి పలు విషయాలను వెల్లడించారు. ఆ విషయాలు, విశేషాలు ఆయన మాటల్లోనే..!!

ఫస్ట్ ఆప్షన్ నీహారిక కాదు..

"ఒక మనసు" కథ రాసుకొన్నప్పుడు, సినిమాలోని "సంధ్య" అనే పాత్రను ఎవరైనా కొత్త అమ్మాయి పోషిస్తే ఆ క్యారెక్టర్ కు అంత ఇంపాక్ట్ రాదని నిర్మాతలు చెప్పారు. అప్పుడు మొదట ఈ కథ సమంతకు చెప్పడం జరిగింది. డేట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేకపోయింది. ఒకరోజు సడన్ గా మధుర శ్రీధర్ గారు ఫోన్ చేసి "నిహారిక" అయితే ఎలా ఉంటుందో చూడండి అన్నారు. ఆమె పేరు వినడం తప్ప ఎప్పుడూ చూడలేదు.. వెంటనే గూగుల్ లో "నిహారిక" ఫోటోలు చూడగానే "సంధ్య" పాత్రకు ఈమె మాత్రమే న్యాయం చేయగలదు అని ఫిక్స్ అయిపోయాను. అలా కొణిదెల నిహారికాను "ఒక మనసు" చిత్రంతో వెండితెరకు పరిచయం చేయడం జరిగింది.

అదే స్పూర్తి..

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ను పాలిటిక్స్ మీద బేస్ చేయడానికి కారణం.. మన ప్రస్తుతం జీవనమే. నేడు మన జీవితాల్లో రాజకీయాలు అంతర్లీనంగా గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయి. నా సినిమాలో దాన్ని చూపించనున్నాను. సూర్య పాత్రకు నాగశౌర్య వందశాతం న్యాయం చేశాడు.

ఎవరూ తక్కువ కాదు..

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల "ఒక మనసు" సినిమా ప్రమోషన్స్ లో నిహారిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది కానీ.. నిజానికి హీరో శౌర్య, హీరోయిన్ నిహారికలది సినిమాలో సమానమైన పాత్రలే. సినిమా విడుదలయ్యాక ఎవరి పాత్ర పరిధి ఎంత అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.

నా మొదటి రూల్ అదే..

మెగా ఫ్యామిలీ అనగానే నా "కథ"ను ఫ్యామిలీ మొత్తానికి చెప్పాలేమో అనుకొన్నాను. అయితే.. నా కథ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అందుకే ముందుగా నేను నిహారికాకి మాత్రమే కాక నా ప్రొడ్యూసర్లకు కూడా ఒక కండిషన్ పెట్టాను. ""ఒక మనసు" కథ నిహారిక మరియు ఆమె తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికీ చెప్పను" అని. దానికి వారు ఒప్పుకోవడం, కథ నిహారికకు విపరీతంగా నచ్చేయడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి.

అంతలా ఇన్వాల్వ్ అయిపోయింది..

నిహారిక "ఒక మనసు" సినిమాలో నటిస్తున్నప్పుడు "సంధ్య" అనే పాత్రలో ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయిందంటే.. షూటింగ్ టైమ్ లో నిహారిక అని పిలిస్తే పలికేది కాదు. కేవలం "సంధ్య" అని పిలిచినప్పుడే సమాధానమిచ్చేది. పైగా నాతో.. "నన్ను "సంధ్య" అనే పిలవండి" అని చెప్పేది. ఆమె దేడికేషన్ లెవల్ కి ఇది ఒక ఉదాహరణ.

 

వాటికి నాకు విడదీయని బంధం..

నా మునుపటి సినిమాలో, ఇప్పుడు "ఒక మనసు"లో కామన్ గా కనిపిస్తున్నవి "కాటన్ చీర, మల్లె పూలు, సముద్రతీరం". ఒక అమ్మాయి-అబ్బాయి మధ్య "రొమాన్స్" పండాలంటే "మల్లెపువ్వు" తప్పకుండా ఉండాలన్నది నా భావం, అలాగే కాటన్ చీర కూడా. ఇక సముద్రతీరం అంటారా.. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి వేసిన సెట్ కూడా తీసుకురాని అందం, ఒక సముద్రతీరం తీసుకువస్తుంది. అందుకే నా ప్రతి సినిమాలో ఏదో విధంగా వాటిని ఎలివేట్ చేస్తుంటాను.

ఇది గదిలో కూర్చొని రాసుకొన్న కథ కాదు..

"ఒక మనసు" కథ నేను గదిలో కూర్చొని రాసుకొన్నది కాదు. నేను చిన్నప్పట్నుంచి చూసిన చాలా మంది వ్యక్తుల జీవితాల నుంచి స్పూర్తి పొంది అల్లుకొన్న అందమైన కథ ఇది. ముఖ్యంగా.. "సంధ్య" అనే పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరనేది సినిమా విడుదలైన తర్వాత చెబుతాను.

నాకు ఆ తేడా తెలియదు..

"ఒక మనసు" కమర్షియల్ సినిమానా? కాదా? అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. నా దృష్టిలో డబ్బులు వచ్చిన ప్రతి సినిమా "కమర్షియల్ సినిమానే". మరి "ఒక మనసు" కమర్షియల్ సినిమా అవునా, కాదా? అనే విషయం ప్రేక్షకులు ఇంకో రెండ్రోజుల్లో తేల్చేస్తారు.

అప్పట్లో తెలియక..

నా మొదటి సినిమా టైమ్ లో నాకు సినిమా అంటే పూర్తి అవగాహన లేదు, అందుకే ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయాను. కానీ.. సినిమాపట్ల పూర్తి అవగాహనతో తీసిన సినిమా "ఒక మనసు". ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని స్టేట్ మెంట్ ఇవ్వలేను కానీ.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అని మాత్రం నమ్మకంగా చెప్పగలను.

ఆడియన్స్ ను తప్పుపట్టకూడదు..

"ఒక మనసు" స్వచ్చమైన ప్రేమ కథ కదా, ఆడియన్స్ చూస్తారా? అని చాలామంది ఆడుతున్నారు. మనం ఆడియన్స్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదండి. ప్రస్తుతం తమిళ పరిశ్రమ కలకళాడుతుంది అంటే తెలుగు ప్రేక్షకులే కారణం. బాలుమహేంద్ర, భానుచందర్ లాంటి దర్శకులు ప్రపంచప్రఖ్యాతి గాంచారంటే మన తెలుగువారే కారణం. "ఒక మనసు" పాటలు ప్రేక్షకులకు నచ్చాయి కదా. అలాగే సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. "నిజాయితీగా ఏదైనా చెప్తే.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను".