English | Telugu

'శ్రీదేవి’ వివాదం పై వర్మ వివరణ

ఒక టీనేజ్‌ కుర్రాడు తన కన్నా పెద్దదైన అమ్మాయిపై అట్రాక్షన్‌ పెంచుకోవడం అనే అంశంతో రూపొందిన ‘మలీనా, సినిమా పరడిసో, సమ్మర్‌ ఆఫ్‌ 42, రాజ్‌కపూర్‌ మేరా నామ్‌ జోకర్‌, తూర్పు పడమర’ వంటి అనేక చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిరచాయి. ఇప్పుడు నేను తీస్తున్న ఒక సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేయగానే, కొన్ని సంఘాలవాళ్లు విరుచుకుపడ్డారు. వాళ్లందరికీ నేను ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రెస్‌ నోట్‌ విడుదల చేస్తున్నాను!

కొంతమందికి నా సినిమా పోస్టర్‌ కంటే, నా ప్రెస్‌నోట్‌లో నేను ప్రస్తావించిన ‘సరస్వతి టీచర్‌’ అంశం ఎక్కువగా కోపం తెప్పించిందని తెలిసింది. నేను మళ్లీ చెబుతున్నా.. చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్‌కి అట్రాక్ట్‌ అయ్యేవాడిని. ఈ మాట నేను ఈమధ్య ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడ దాన్ని అర్ధం చేసుకొన్నారు. ఎందుకంటే.. ‘యవ్వనం వికసిస్తున్న రోజుల్లో అలాంటి భావాలు కలగడం చాలా సహజం’ అనే ఇంగిత జ్ఞానం ఆవిడకు ఉంది కాబట్టి! ఆవిడకే ఏ సమస్య లేనప్పుడు, వేరే ఏమీ తెలియనివాళ్లకు ఏం సమస్యో.. నాకు సమస్య అయ్యి కూర్చుంది!!

ఇక నా సినిమా పోస్టర్‌ చూసి, కథేమిటో వాళ్లే ఊహించేసుకొని.. పోస్టర్‌లో ఉన్న అమ్మాయి ‘టీచర్‌’ అని ఫిక్సయిపోతే.. అంతకన్నా వెర్రితనం లేదు. ప్రెస్‌నోట్‌లో అంత క్లియర్‌గా నేను రాసింతర్వాత కూడా అర్ధం చేసుకోలేనంత నిరక్షరాస్యత వాళ్లలో ఉండడం నాకు చాలా ఆశ్యర్యాన్ని కలిగించింది. మొత్తం సినిమా తీసాక, అందులో అభ్యంతరమైన సన్నివేశాలుంటే.. ఆ వ్యవహారం చూడ్డానికి సెన్సార్‌బోర్డ్‌ ఉంది. సెన్సార్‌బోర్డ్‌ను అధిగమించి.. వీళ్లే అన్ని నిర్ణయాలు తీసుకొంటామంటే.. ఇక సెన్సార్‌ బోర్ట్‌ ఎందుకు?

ఇక మరికొందరు. ‘సావిత్రి’ పేరును టైటిల్‌గా పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తపరిచారు. ఎందుకంటే.. పురాణాల్లో సావిత్రి పతివ్రత కాబట్టి అని చెప్పారు. అలా అయితే.. మిగతా పేర్లు గల మహిళలెవరూ పతివ్రతలు కాదని వాళ్లు చెప్పకనే చెప్పడం సభ్య సమాజానికి సిగ్గు చేటు. స్టేట్‌ కమీషన్‌వాళ్లు నాకు పంపించిన నోటీస్‌ ప్రకారం.. ‘ఆ అమ్మాయి’ టీచర్‌ అని వాళ్లకి వాళ్లే డిసైడ్‌ చేసుకొన్నారు. విషయం ఏమిటంటే.. సినిమా పాయింట్‌ను చెప్పడానికి..‘నా టీనేజ్‌లో నేను మొదటి ఆకర్షణకి లోనైన మా ఇంగ్లీష్‌ టీచర్‌ సరస్వతి మేడమ్‌ని ఉదహరించడం జరిగింది. అంతేకానీ, పోస్టర్‌లో చూపించిన లేడి.. టీచర్‌ కాదు, ఆ కథ నాది కాదు. ఇంకా చెప్పాలంటే` ఈ సినిమా కథ.. టీచర్‌`స్టూడెంట్‌ మధ్య జరిగే కథ ఎంతమాత్రం కాదు!

ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం.. ఒక అబ్బాయి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఆధునిక జీవనశైలి వలన ఏవిధంగా ప్రభావితమయ్యాడు? దాని వలన, ఆ అబ్బాయితోపాటు.. అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి దుష్పరిణామాలకు లోనయ్యారనేది చెప్పడం. ఇది తెలుసుకోకుండా.. కొంతమంది బాధ్యతారాహిత్యంతో, సినిమాలో లేని విషయాలను.. ఉన్నట్లుగా తమకుతాముగా ఊహించేసుకొని.. టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇంకా.. నిజాలు తెలియకుండా.. నాకు నిందాపూర్వక నోటీస్‌ పంపిన స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ వారికి పూర్తి వివరణ ఇస్తాను. సినిమా పోస్టర్‌లో కనిపిస్తున్న అబ్బాయి నటుడు. ఇంతకుముందు కూడా అతను సినిమాల్లో నటించాడు. నా సినిమాలో కూడా అతను తన తల్లిదండ్రుల అనుమతితో మరియు, వారి సమక్షంలో నటిస్తున్నాడు.

సినిమా ఏమిటో, దాని కథ ఏమిటో తెలుసుకోకుండా.. ఎంతో డబ్బుతో, మరింకెంతో శ్రమతో మేము తీసే సినిమాకి.. ‘చీప్‌ పబ్లిసిటి’ కోసం మాకు నెగటివ్‌ పబ్లిసిటి ఇచ్చినవారందరిపై కేసులు పెట్టబోతున్నాను. నాకు నోటీస్‌ పంపిన ‘స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌’ ఆర్గనైజేషన్‌కి కూడా నా సమాధానం ఇవ్వబోతున్నాను!!