Read more!

English | Telugu

రాజమౌళి సలహాను నాని పాటిస్తాడా?

దర్శకధీరుడు రాజమౌళి సినిమాని ఎంత గొప్పగా తెరకెక్కిస్తాడో, అంతకంటే గొప్పగా ప్రమోట్ చేస్తాడు. సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడం కోసం ఆయన అనుసరించే ప్రమోషనల్ స్ట్రాటజీలు బాగుంటాయి. అందుకే ఆయనను మాస్టర్ మైండ్ అంటుంటారు. తాజాగా ఆయన నేచురల్ స్టార్ నానికి అదిరిపోయే సలహా ఇచ్చారు.

నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందిన 'హిట్-2' డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2020లో విడుదలై విజయం సాధించిన 'హిట్'కి ఇది సీక్వెల్. ఈ ఫ్రాంచైజ్ లో మొత్తం ఏడు సినిమాలు రానున్నాయని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చే సినిమాల విడుదల విషయంలో ఒక స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుందని రాజమౌళి సలహా ఇచ్చారు.

సోమవారం సాయంత్రం జరిగిన 'హిట్-2' ప్రీ రిలీజ్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "మన దేశంలో ఇలాంటి ఫ్రాంచైజ్ లేదు. హీరో, దర్శకుడు ఎవరని ఆలోచించకుండా హిట్ సిరీస్ చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా చేశారు. అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చే సినిమాలను ప్రతి ఏడాది ఒకే సీజన్ లో విడుదల చేస్తే బాగుంటుంది. ఇది హిట్ సీజన్ అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రతి ఏడాది ఒకే సమయంలో విడుదల చేయాలి" అని రాజమౌళి సూచించారు.

'హిట్' టీమ్ కి రాజమౌళి ఇచ్చిన సలహా అదిరిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి చెప్పినట్టు ప్రతి ఏడాది ఒకే సమయానికి హిట్ ఫ్రాంచైజ్ మూవీ వస్తే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డిసెంబర్ లో 'హిట్-2' వస్తుంది కాబట్టి వచ్చే ఏడాది డిసెంబర్ లో 'హిట్-3' వచ్చేలా చూడాలని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో 'హిట్' టీమ్ ఏం చేస్తుందో చూడాలి.