Read more!

English | Telugu

కృష్ణవంశీ అద్భుత సృష్టి 'ఖడ్గం'కు 20 ఏళ్ళు

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన సినిమాలలో 'ఖడ్గం' ఒకటి. దేశభక్తిని పెంపొందించేలా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రసారమైతే ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రేక్షకుల హృదయాల్లో అంతలా స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్ళు పూర్తయింది.

దేశభక్తి, మత ఘర్షణలు వంటి సున్నిత అంశాలను కృష్ణవంశీ చక్కగా చూపించారు. కొన్ని కొన్ని సన్నివేశాలు కదిలించేలా, కంటతడి పెట్టించేలా ఉంటాయి. 'ఖడ్గం'లో ప్రతి పాత్ర పవర్ ఫుల్ గా గుర్తుండిపోయేలా ఉంటాయి. టెర్రరిస్ట్ ల చేతిలో ప్రేయసిని పోగొట్టుకొని.. ఆమె దూరమైన బాధని, టెర్రరిస్ట్ లపై కోపాన్ని గుండెల్లో దాచుకునే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ మెప్పించాడు. అలాగే దేశాన్ని ఎంతగానో ప్రేమించే ముస్లిం అయిన అంజద్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించాడు. టెర్రరిస్ట్ గా మారిన సొంత తమ్ముడిని చంపడానికి కూడా వెనకాడని అంజద్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తూ 'ఒక్క ఛాన్స్' అంటూ తిరిగే కోటి పాత్రలో రవితేజ విశేషంగా ఆకట్టుకున్నాడు. స్వాతిగా సోనాలి బింద్రే, సీతామహాలక్ష్మీగా సంగీత, పూజగా కిమ్ శర్మ, అజార్ గా షఫీ ఇలా అందరూ గుర్తిండిపోయే పాత్రలు పోషించారు. ఇక కమెడియన్ పృథ్వీ ఈ చిత్రంతోనే 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్నాడు.

దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రంలో 'నువ్వు నువ్వు', 'అహ అల్లరి', 'మేమే ఇండియ‌న్స్', 'గోవిందా గోవిందా', 'ముసుగు వేయొద్దు', 'ఖ‌డ్గం ఖ‌డ్గం' ఇలా అన్నీ పాట‌లు విశేష ఆదరణ పొందాయి. కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సుంకర మధుమురళి నిర్మించిన ఈ చిత్రం 2002 నవంబరు 29న విడుదలై ఘన విజయం సాధించింది. ఉత్తమ దర్శకులు(కృష్ణవంశీ)తో పాటు మొత్తం ఐదు విభాగాల్లో ఈ చిత్రం నంది అవార్డులు గెలుచుకుంది.