Read more!

English | Telugu

ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ‘కంగువ’ నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌రాజాపై పోలీస్‌ కేసు!

కోలీవుడ్‌ హీరోలు సూర్య, కార్తీల బంధువు, స్టూడియో గ్రీన్‌ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా గురించి అందరికీ తెలిసింది. ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి దేశవ్యాప్తంగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా జ్ఞానవేల్‌రాజా ‘కంగువ’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆయనపై పోలీస్‌ కేసు నమోదైంది. అంతేకాదు, అతని భార్యపై కూడా కేసు నమోదు చేశారు మాంబలం పోలీసులు. 

వివరాల్లోకి వెళితే.. జ్ఞానవేల్‌ ఇంట్లో లక్ష్మీ అనే మహిళ గత కొంతకాలంగా పనిచేస్తోంది. కొన్నిరోజుల క్రితం జ్ఞానవేల్‌ ఇంట్లో నగలు చోరీ జరిగినట్టు గుర్తించారు. ఈ చోరీ విషయంలో పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేసింది జ్ఞానవేల్‌రాజా భార్య నేహ. ఇంట్లో మిస్‌ అయిన నగల గురించి ఆమెను ప్రశ్నించింది నేహ. తనకు ఏమీ తెలీదని ఆమె సమాధానం ఇచ్చింది. ఇది జరిగిన మరుసటి రోజు లక్ష్మీ పనికి రాలేదు. దీంతో నేహ అనుమానం రెట్టింపు అయింది. ఆమెకు కాల్‌ చేస్తే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉంది. జ్ఞానవేల్‌ రాజా మాంబలం పోలీస్‌ స్టేషన్‌లో చోరీ గురించి ఫిర్యాదు చేశారు. అలానే పనిమనిషి లక్ష్మి మీద అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు లక్ష్మిని పిలిచి నగల గురించి విచారణ చేపట్టారు. 

పోలీసులు విచారించిన మరుసటిరోజే లక్ష్మీ ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసియులో ఉన్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన తల్లి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం నిర్మాత జ్ఞానవేల్‌రాజా, అతని భార్య నేహా అని ఆ ఇద్దరిపై మాంబలం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లక్ష్మీ కుమార్తె. నగల చోరీకి, తన తల్లి సంబంధం లేదని, ఈ విషయంలో వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిరదని, అందుకు ఆ ఇద్దరూ ప్రేరేపించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును మాంబలం పోలీసులు విచారిస్తున్నారు.