English | Telugu

అది నా ఇష్టం.. మీకెందుకు సమాధానం చెప్పాలి.. నెటిజన్లపై నయనతార ఫైర్‌!

అది నా ఇష్టం.. మీకెందుకు సమాధానం చెప్పాలి.. నెటిజన్లపై నయనతార ఫైర్‌!

ఒక సినిమాని అందరూ మెచ్చేలా తియ్యడం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా సినిమా రిలీజ్‌కి వచ్చే సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు.. మేకర్స్‌ నిర్వహించే ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఉంటారు. అందులో భాగంగా రకరకాల ఈవెంట్స్‌లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటారు. అయితే కొందరు హీరోలు, హీరోయిన్లు సినిమా చేయడంతో తమ పని అయిపోయిందని, ప్రమోషన్స్‌కి రావడం కుదరదని చెప్తుంటారు. అలాంటి వారిలో హీరో అజిత్‌, హీరోయిన్‌ నయనతార పేర్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. అజిత్‌ విషయానికి వస్తే.. సెట్‌కి వచ్చి షూటింగ్‌లో పాల్గొనడం తప్ప ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు, తనకు సంబంధం లేదని చెప్పేస్తుంటాడు. ఈవెంట్స్‌కి హాజరు కావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడు. హీరోయిన్‌ నయనతారది కూడా అదే పద్ధతి. సినిమా కమిట్‌ అయ్యే ముందే తాను ప్రమోషన్స్‌కి రాను అని చెప్పేస్తుంది. దాని ప్రకారమే అగ్రిమెంట్‌ చేసుకుంటుంది. అయితే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కోసం షూటింగ్‌ ప్రారంభం కాకముందే ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో నయనతార ట్రోలింగ్‌కి గురవుతోంది. 

వరస హిట్స్‌తో దూసుకెళ్తున్న అనిల్‌రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే తన నెక్స్‌ట్‌ మూవీ మెగాస్టార్‌ చిరంజీవితో అని అనౌన్స్‌ చేయడం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి ఎనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రమోషన్స్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి 157వ సినిమా కావడంతో అనిల్‌ రావిపూడి ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నారు. ఈ సినిమా గురించి డిస్కస్‌ చేసేందుకు చెన్నయ్‌ వెళ్లిన అనిల్‌.. నయనతారను కలిసి, ఆమెను ఒప్పించి వెంటనే ఒక ప్రమోషన్‌ వీడియో కూడా చేయించారు. ప్రమోషన్స్‌కి దూరంగా ఉండే నయన్‌తో సినిమా స్టార్ట్‌ అవ్వకముందే ఒక వీడియో చేయించడంతో అనిల్‌ను అందరూ అప్రిషియేట్‌ చేశారు. అదే సమయంలో నయనతారను ట్రోల్‌ చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇంతకుముందు చిరంజీవితో సైరా, గాడ్‌ఫాదర్‌ చిత్రాల్లో నటించిన నయనతారకు ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. డబ్బు ఎక్కువ ఇచ్చారని ముందు నుంచే ప్రమోషన్స్‌ చేస్తున్నావా అంటూ కొందరు నెటిజన్లు నయనతారను ట్రోల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ నెటిజన్ల నుంచే ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ‘ఇప్పటివరకు తమిళ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్‌లో పాల్గొనని నువ్వు.. తెలుగు సినిమాకి షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఎలా ప్రమోషన్స్‌ చేస్తున్నావు? నీకు తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్‌ ఉంటే టాలీవుడ్‌కి వెళ్లిపో.. ఇక్కడెందుకు ఉన్నావు?’ అంటూ తీవ్రపదజాలంతో నయనతారను విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన నయనతార.. ‘ప్రమోషన్స్‌కి వెళ్లాలా? వద్దా? అనేది నా వ్యక్తిగత విషయం. నాకు ఎలా వీలవుతుందో అలా చేసుకునే అవకాశం నాకుంది. ఈ విషయంలో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇలాంటి అనవసర విషయాల గురించి మాట్లాడి నా టైమ్‌ వేస్ట్‌ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు’ అంటూ మరో ప్రశ్నకు ఆస్కారం లేకుండా ఘాటుగా సమాధానమిచ్చింది నయనతార.