English | Telugu
Kannappa : 'ఓజీ'కి ఎక్కువ.. 'రాజాసాబ్'కి తక్కువ..!
Updated : Jun 6, 2025
కొందరు తమ సినిమాకి అంత బడ్జెట్ అయింది, ఇంత బడ్జెట్ అయిందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం బడ్జెట్ ఎంత అయిందో చెప్పడానికి ఇష్టపడరు. కానీ, మంచు విష్ణు మాత్రం.. చెప్పీ చెప్పనట్టుగా.. అర్థమై కానట్టుగా బడ్జెట్ ని చెప్పేశారు. (Kannappa Movie)
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రాన్ని మంచు ఫ్యామిలీనే భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే ఆ బడ్జెట్ ఫిగర్ ఎంత అనేది కరెక్ట్ గా బయటకు తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బడ్జెట్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైతే.. విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ 'ఓజీ' కంటే కాస్త ఎక్కువ, ప్రభాస్ 'రాజాసాబ్' కంటే కాస్త తక్కువ అని విష్ణు చెప్పాడు. అయితే నెంబర్ మాత్రం చెప్పలేదు. ఎంతో చెబితే ఐటీ వాళ్ళు వస్తారు (నవ్వుతూ) అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.
కన్నప్పలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటించారు. దాదాపు సినిమా అంతా న్యూజిల్యాండ్ లోనే షూటింగ్ జరుపుకుంది. విష్ణు మాటలను బట్టి చూస్తే.. కన్నప్ప బడ్జెట్ రూ.200 కోట్లు దాకా అయ్యుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
