English | Telugu

రీ రిలీజ్‌ ఇలా కూడా చేస్తారా.. ఇది బాలయ్యకే సాధ్యమంటున్న ఫ్యాన్స్‌!

రీ రిలీజ్‌ ఇలా కూడా చేస్తారా.. ఇది బాలయ్యకే సాధ్యమంటున్న ఫ్యాన్స్‌!

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఫస్ట్‌ రిలీజ్‌, సెకండ్‌ రిలీజ్‌ అంటు పలుమార్లు రిలీజ్‌ అయ్యేవి. కొన్ని సినిమాలు సెకండ్‌ రిలీజ్‌లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సినిమా రిలీజ్‌ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత రీరిలీజ్‌ పేరుతో స్టార్‌ హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. అలా ఈమధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్‌ అయి కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి, ఆదిత్య 369 వంటి సినిమాలు కూడా రీరిలీజ్‌లో మంచి కలెక్షన్లు సాధించాయి. ఆ కోవలోనే ఇప్పుడు లక్ష్మీనరసింహా చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రీరిలీజ్‌లలోనే ఒక కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. బాలకృష్ణ, జయంత్‌ సి.పరాన్జీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌ రిలీజ్‌లో కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. 

ఇప్పుడు లక్ష్మీనరసింహ రీ రిలీజ్‌లో ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు మేకర్స్‌. ఫస్ట్‌ రిలీజ్‌లో ఈ సినిమా కోసం ఒక పాటను షూట్‌ చేసి ఆ తర్వాత లెంగ్త్‌ ప్రాబ్లమ్‌ వల్ల దాన్ని తొలగించారు. ఇప్పుడు ఆ పాటను యాడ్‌ చేసి రిలీజ్‌ చెయ్యాలని భావిస్తున్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్‌. అయితే ఆ పాటకు సంబంధించిన విజువల్స్‌ ఉన్నాయి కానీ సౌండ్‌ లేదు. దాన్ని ఎలాగైనా సినిమాకి జత చేయాలన్న ఉద్దేశంతో ఆ విజువల్స్‌కి తగిన మ్యూజిక్‌ను భీమ్స్‌తో చేయించారు. దానికి లిరిక్స్‌ను చంద్రబోస్‌ రాశారు. ఇది ఖచ్చితంగా ఇప్పటివరకు ఎవరూ చేయని ఎక్స్‌పెరిమెంట్‌ అని చెప్పొచ్చు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా ఎంతో రిస్క్‌ తీసుకొని ఈ పాటను సిద్ధం చేశారు. ఈ పాట ప్రేక్షకులకు, అభిమానులకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని బెల్లంకొండ నమ్ముతున్నారు. 

ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన బెల్లంకొండ సురేష్‌ ఆలోచనని మిగతా నిర్మాతలు కూడా ఫాలో అయితే మంచి రిజల్ట్‌ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా డిలీట్‌ చేసిన సన్నివేశాలు, పాటలు కొన్ని సినిమాలకు ఉంటాయి. ఆ తర్వాత వాటిని వాడకుండా అలా ఉంచేస్తారు. ఇప్పుడు ఆ కంటెంట్‌ అందుబాటులో ఉంటే రీరిలీజ్‌ చెయ్యాలనుకున్న నిర్మాతలు వాటిని యాడ్‌ చేస్తే సినిమాకి ఒక కొత్త లుక్‌ వస్తుంది. బెల్లంకొండ ఇన్‌స్పిరేషన్‌తో మిగతా నిర్మాతలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారేమో చూడాలి. లక్ష్మీనరసింహ చిత్రంలో కొత్త పాటను యాడ్‌ చేస్తున్నారన్న విషయం తెలిసి ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చెయ్యాలంటే తమ అభిమాన హీరోకే సాధ్యం అంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.