Read more!

English | Telugu

"కుందనపు బొమ్మ" మూవీ రివ్యూ

 

నటీనటులు:

సుధీర్ వర్మ, చాందిని చౌదరి, సుధాకర్ కోమాకుల, నాగినీడు, రాజీవ్ కనకాల తదితరులు..

సాంకేతికవర్గం:

సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్.డి.జాన్
సమర్పణ: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: జి.అనిల్ కుమార్-రాజు-జి.వంశీకృష్ణ
రచన-దర్శకత్వం: ముళ్ళపూడి వరా
విడుదల తేది: 24/6/2016
 

తెలుగు సినిమా స్థాయిని తమ సినిమాలతో ద్విగుణీకృతం చేయడంతో.. తమ అపూర్వ స్నేహానుబంధంతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహనీయులు బాపు-రమణ. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడు ముళ్ళపూడి వరా. ఆయన తీసిన సినిమాల దర్శకుడిగా కంటే.. ముళ్ళపూడి వెంకటరమణగారి కొడుకుగా, బాపుగారి అల్లుడిగానే అందరికీ సుపరిచితుడైన ముళ్ళపూడి వరా ఇప్పటివరకూ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు, ఎన్టీయార్ హీరోగా తెరకెక్కించిన "నా అల్లుడు" అప్పట్లో ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలవగా, రెండో సినిమాగా తెరకెక్కించిన "విశాఖ ఎక్స్ ప్రెస్" మాత్రం ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించుకొంది. మళ్ళీ దాదాపు ఎనిమిదేళ్ళ విరామంతో ముళ్ళపూడి వరా మళ్ళీ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం "కుందనపు బొమ్మ". యూట్యూబ్ సెన్సేషన్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ద్వారా సుధీర్ వర్మ హీరోగా పరిచయమవ్వగా, "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" ఫేమ్ సుధాకర్ కోమాకుల నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించాడు. ఏడాది క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జూన్ 24) విడుదలైంది. మరి ముళ్ళపూడి వరా మూడోసారైనా దర్శకుడిగా తనను తాను నిరూపించుకొన్నాడా? లేదా? అనే విషయం తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే..!!

కథ:

విజయనగరం దగ్గర్లోని ఒక పల్లెటూరు పెద్ద మహాదేవరాజు (నాగినీడు). చిన్నప్పట్నుంచి తన ఇంట్లోనే పెరిగిన తన మేనల్లుడు గోపి (సుధాకర్ కోమాకుల)తోనే తన గారాలపట్టి సుచి (చాందిని చౌదరి) పెళ్లి చేయాలనుకొంటాడు మహాదేవరాజు.
కానీ.. సుచి మాత్రం తమ ఇంటికి కారు రిపేర్ చేయడానికి వచ్చిన వాసు (సుధీర్ వర్మ)ను ప్రేమిస్తుంది. తమ ప్రేమ విషయం తనకు బావ అయిన గోపీకి చెప్పగా, తానే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తానని చెబుతాడు గోపి. కట్ చేస్తే.. తన పెళ్లి సుచితో వెంటనే జరిపించేయమని కంగారు పెడుతుంటాడు గోపి. అసలు అప్పటివరకూ సుచి అంటే ఇష్టం లేని గోపి, ఉన్నట్లుండి ఆమెను ఎందుకు పెళ్ళాడాలనుకొంటాడు ? సుచి-వాసుల ప్రేమ విజయం సాధించిందా? లేదా? చివరికి "కుందనపు బొమ్మ" (సుచి)ని దక్కించుకొన్నది ఎవరు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

టైటిల్ పాత్ర అయిన "కుందనపు బొమ్మ"గా నటించిన చాందిని చౌదరి పోస్టర్లలో చూడడానికి బాగానే ఉన్నా.. సినిమాలో మాత్రం అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ భరించలేం. నటనలో కనీసం "అ ఆ"లు సైతం నేర్చుకోని చాందిని ముఖంలో సన్నివేశానికి తగ్గ హావభావాలు భూతద్ధం పెట్టి వెతికినా కనిపించవు. ఇక పాటల్లో, కామెడీ సీన్లలో చాందినికి పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేయడం ఖాయం. కొత్తబ్బాయి సుధీర్ వర్మ అక్కడక్కడా కొన్ని సీన్లలో ఫర్వాలేదు గానీ.. ఓవరాల్ గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో సుధాకర్ నటించడానికి కాస్త ప్రయత్నించిప్పటికీ.. క్యారెక్టర్ లో డెప్త్ లేకపోవడం వల్ల అతని ప్రయాస వృధా అయ్యింది. నాగినీడు, రాజీవ్ కనకాల తమ పాత్రల పరిధిమేరకు ఒదిగిపోయారు, యాంకర్ ఝాన్సీ  నవ్వించాలని "కంగనా" భాషతో చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టింది.

సాంకేతికవర్గం పనితీరు:

అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా.. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారంటే నమ్మలేని స్థాయిలో ఉన్నాయి బాణీలు. "అలా నువ్వు వస్తుంటే.." అనే ర్యాప్ సాంగ్ వినడానికి సోసోగా ఉండగా.. చిత్రీకరణలో మాత్రం దర్శకుడి పైత్యం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎస్.డి.జాన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఉన్న మైనస్ లలో ఒకటిగా నిలిచింది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించిన జాన్ రిపీటెడ్ ఫ్యాన్ షాట్స్ , టైట్ క్లోజ్ షాట్స్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. సినిమాకి డి.ఐ సరిగా చేయించని లోటు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంటుంది. ఎడిటింగ్ సినిమాకి మెయిన్ మైనస్. సీన్ టు సీన్ కనెక్టివిటీ ఎక్కడా కనిపించదు.

ముళ్ళపూడి వరా రాసుకొన్న కథ మాత్రమే కాదు ఆ కథను నడిపించిన కథనం కూడా ఆయన ఇంకా 90వ దశకంలోనే ఆగిపోయాడని స్పష్టం చేస్తుంది. కథలో కొత్తదనం పక్కనపెడితే.. క్లారిటీ కూడా ఎక్కడా ఉండదు. ఇక దర్శకుడిగానూ తన మార్క్ ను చూపించలేకపోయాడు వరా, పాటల్లో వంశీ స్టైల్ ను, సన్నివేశాల్లో బాపుగారి శైలిని కాపీ కొట్టేశాడు. పోస్టర్లు, ట్రైలర్లు చూసి "బాగుంటుందేమో" అన్న ఆశతో సినిమాకోచ్చేవారిని తీవ్రంగా నిరాశపరిచాడు ముళ్ళపూడి వరా.

మొత్తానికి.. "కుందనపు బొమ్మ" అనే టైటిల్ ఎంత వినసోంపుగా ఉందో.. సినిమా చూడడానికి అంతే ఇబ్బందికరంగా ఉంది. కథ-కథనాల్లో క్లారిటీ లేదు, నటీనటుల పెర్ఫార్మెన్స్ లో జీవం లేదు, మొత్తానికి సినిమాలో విషయం లేదు, ఆ కారణంగా ఓపిక పాళ్ళు  మరీ ఎక్కువగా ఉంటే తప్పితే "కుందనపు బొమ్మ" సినిమాను చూడకుండా ఉండడమే సముచితం!

 

రేటింగ్: 1/5