Read more!

English | Telugu

పిఠాపురంలో చిరంజీవి రోడ్‌ షోకి సర్వం సిద్ధం.. చిరు వెంట చరణ్‌, నాగబాబు!

ఎపిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి ప్రచారం చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ఆ విషయాన్ని ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడామె వైసీపి పార్టీ తరఫున అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వంగా గీతను ఓడిరచి తమ్ముడిని గెలిపించాలని పిఠాపురం ఓటర్లను అభ్యర్థించేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ వేసినపుడు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సామాజిక సమీకరణాల ప్రభావం పిఠాపురంలో ఈసారి గెలుపు ఓటములను నిర్దేశించనుంది. 

పవన్‌ ఇప్పటికే రెండు సభలు నిర్వహించారు. పిఠాపురం పైన తన విజన్‌ ఏంటో వెల్లడిరచారు. ఇదిలా ఉంటే.. పవన్‌ పార్టీకి కొద్ది రోజుల క్రితం చిరంజీవి రూ 5 కోట్ల విరాళం ఇచ్చారు. టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌బాబుకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. వారిని గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చారు. జనసేన పార్టీని, పవన్‌కళ్యాణ్‌ని గెలిపించేందుకు చిరంజీవి మే 5 నుంచి పిఠాపురంలో ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మొదట పిఠాపురం వచ్చి ఆ తర్వాత గొల్లప్రోలు, పిఠాపురం టౌన్‌లలో రోడ్‌ షో నిర్వహిస్తారు. ఈ రోడ్‌ షోలో చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌, నాగబాబు కూడా పాల్గొంటారని సమాచారం. చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది. చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్‌ కోరుతున్నారు. దీని పై చిరంజీవి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చిరంజీవి తలపెట్టిన ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనేలా అందరికీ సమాచారాన్ని అందించారు.