Read more!

English | Telugu

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

లెజెండరీ యాక్టర్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న రావాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమకు చేసిన కృషికి గాను చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

ఢిల్లీ వెళ్లి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి.. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. మీడియా నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. "ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం సముచితం. రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు, ఎన్టీఆర్ గారికి కూడా రావడం సముచితం. ఆయనకు రావడం ఎంతో ఆనందదాయకం. ఆరోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను." అన్నారు.