English | Telugu
బెల్లంకొండ సురేశ్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు
Updated : Mar 11, 2022
సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పైనా, ఆయన కుమారుడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌పైనా చీటింగ్ కేసు నమోదైంది. వి.ఎల్ శ్రావణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఆ ఇద్దరిపై కేసు పెట్టారు. 2018-19 కాలంలో బెల్లంకొండ సురేశ్, సాయిశ్రీనివాస్ ఓ సినిమా నిర్మాణం కోసం తన దగ్గర్నుంచి రూ. 85 లక్షలు తీసుకున్నారనీ, అప్పట్నుంచీ ఇంతదాకా దాన్ని తిరిగి చెల్లించలేదనీ తన ఫిర్యాదులో శ్రావణ్ కుమార్ ఆరోపించారు. తను డబ్బు అడిగినప్పుడల్లా ఆ తండ్రీకొడుకులు తనను బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
శ్రావణ్ ఫిర్యాదు ప్రకారం, 2018లో ఆయన దగ్గర బెల్లంకొండ సురేశ్ రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమా నిర్మిస్తున్నానంటూ మరోసారి డబ్బు తీసుకున్నారు. ఇలా మొత్తం తన దగ్గర రూ. 85 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
