Read more!

English | Telugu

చాందిని చౌదరి "కుందనపు బొమ్మ" ఇంటర్వ్యూ

అలా జరగకపోతే ఈపాటికే స్టార్ హీరోయిన్ అయిపోయేదాన్నేమో..!

-చాందిని చౌదరి

స్టార్ హీరోయిన్లను మించిన పాపులారిటీ, "ఆహా" అనిపించే అందం వంటి అంశాలు సమపాళ్లలో కలిగిన పదహారణాల తెలుగమ్మాయి "చాందిని చౌదరి". యూట్యూబ్ సెన్సేషన్ గా పేర్కొనబడే చాందిని చౌదరి "కేటుగాడు" చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ చాందిని స్టార్ డమ్ కు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అయితే.. తాను ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే ఈపాటికే స్టార్ హీరోయిన్ ని అయిపోయేదాన్నని చెబుతోంది చాందిని. ఆమె నటించిన తాజా చిత్రం "కుందనపు బొమ్మ" రేపు (జూన్ 24) ప్రేక్షకుల ముందుకురానుంది ఈ సందర్భంగా చాందిని చెప్పిన సంగతులు..!!

"మధురం" ముఖ్యపాత్ర పోషించింది...

నేను పుట్టింది వైజాగ్ లోనే అయినా చదువు మొత్తం బెంగుళూరులోనే. చదువుకుంటున్న సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడం మొదలెట్టాను. ఆ షార్ట్ ఫిలిమ్స్ నాకు బోలెడంత పేరు తెచ్చిపెట్టాయి. నేను నటించిన ఆఖరి ఇండిపెండెంట్ ఫిలిమ్ "మధురం". ఫణీంద్ర అని నా స్నేహితుడు డైరెక్ట్ చేశాడు. ఆ షార్ట్ ఫిలింలో నా యాక్టింగ్ చూసే నన్ను "కుందనపు బొమ్మ" సినిమాకి అడిగారు. అలా "మధురం" అనే ఇండిపెండెంట్ ఫిలిమ్ నా సినిమా కెరీర్ కి గట్టి పునాది వేసింది.

అంత కష్టం ఎందుకో నాకైతే అర్ధం కాదు...

మన తెలుగు చిత్రసీమలో ఇతర భాషల నుంచి హీరోయిన్లను ఎందుకు దిగుమతి చేసుకొంటారో నాకైతే అస్సలు అర్ధం కాదు. వాళ్ళకి భాష తెలియక, సరైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేక ఇబ్బందిపడుతూ ఎందుకంత కష్టపడడం. అయితే.. ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి నేను దానిగురించి పెద్దగా పట్టించుకోను. కానీ.. తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేస్తే మాత్రం బాగుంటుంది.

సెలెక్ట్ చేసుకోరేమో అనుకొన్నాను...

నిజానికి "కుందనపు బొమ్మ" సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సినిమాకి నేను జుట్టుకి రంగులు వేసుకొని, ఫంకీ స్టైల్ లో మరీ వెస్ట్రన్ గర్ల్ లా ఉండేదాన్ని. "కుందనపు బొమ్మ" అంటే స్వచ్చమైన తెలుగు ఆడపడుచు, ఆ పాత్రకు నన్ను సెలక్ట్ చేస్తారో లేదో అని టెన్షన్ పడ్డాను. కానీ, రాఘవేంద్రరావుగారు, కీరవాణిగారు నన్ను సెలక్ట్ చేయడంతో నా అనుమానం పోయింది.

సుచి చాలా సెన్సిటివ్...

"కుందనపు బొమ్మ" సినిమాలో నా పాత్ర పేరు సుచి. చాలా సెన్సిటివ్ అమ్మాయిని. నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకొంటే అస్సలు ఊరుకోను. మా ఇంట్లోకి బావగా ఎంటరైన సుధాకర్ కోమాకుల కారణంగా నా జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకొన్నాయి? అనేది సినిమా కథాంశం. సుచి క్యారెక్టర్ ను తెలుగు ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఎవర్నీ నమ్మకూడదని తెలుసుకొన్నాను...

ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ సమయంలో నేను ఇండస్ట్రీ గురించి తెలుసుకొన్నది ఏంటంటే.. "ఎవ్వర్నీ నమ్మకూడదు" అని. నేను పుట్టిపెరిగిన విధానం వల్ల ఎవరితోనైనా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం అలవాటైపోయింది. ఆ కారణంగా ఇండస్ట్రీలో లేనిపోని సమస్యలు చాలా ఎదుర్కొన్నాను. ఆ సమస్యల గురించి ఇప్పుడు చెప్పలేను.

నా కెరీర్ తో ఆడుకొన్నారు..

నిజానికి నా ఎంట్రీ రెండేళ్ల క్రితమే జరగాలి. కానీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ (పేరు చెప్పను) ఒక సినిమా కోసమని నాతో రెండేళ్లు అగ్రిమెంట్ చేసుకొన్నారు. అయితే.. తర్వాత నా స్థానంలో వేరే హీరోయిన్ ను ఎంపిక చేసుకొన్నారు. నన్ను ఆ సినిమాలో నటింపజేయక.. ఇంకో సినిమాలో నటించడానికి పర్మిషన్ ఇవ్వక నా కెరీర్ తో ఫుట్ బాల్ ఆడుకొన్నారు. నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన టైమ్ కి సినిమాలు చేయడం మొదలెట్టి ఉంటే.. ఈపాటికి స్టార్ హీరోయిన్ ని అయిపోయేదాన్నేమో!

ఓవర్ ఎక్స్ పోజింగ్ మాత్రం చేయను...

సినిమా అన్నాక పెర్ఫార్మెంస్ తోపాటు గ్లామర్ రోల్స్ కూడా చేయాలి. నాకు గ్లామర్ రోల్స్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగని ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం శృతిమించను. నాకంటూ ఒక పరిధి ఉంది, ఆ పరిధిలోనే నటిస్తాను.

 

సిస్టర్ రోల్స్ ఇంట్రెస్ట్ లేదు...

నేను ఇండస్ట్రీకి వచ్చింది హీరోయిన్ గా రాణిద్దామనే. నాకిప్పటివరకూ సిస్టర్ రోల్స్ చాలా వచ్చాయి. కానీ, "బ్రహ్మోత్సవం"లో మాత్రం శ్రీకాంత్ అడ్డాలగారి కోసం నటించాను. సినిమాలో నాకు చాలా డైలాగ్స్ ఉన్నాయి, కానీ లెంగ్త్ ఎక్కువ అయ్యిందని కట్ చేశారట. అందువల్ల సినిమాలో ఏదో గెస్ట్ రోల్ లా కనిపిస్తుంది నా పాత్ర.

తెలుగులో అలాంటి సినిమా ఇంకా రాలేదు...

ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. రేవన్ యాదు డైరెక్షన్ లో ఒక సినిమా, అలాగే "మను" అని "మధురం" ఇండిపెండెంట్ ఫిలిమ్ ను డైరెక్ట్ చేసిన ఫణీంద్ర దర్శకత్వంలో మరో సినిమా. "మను" చాలా డిఫరెంట్ ఫిలిమ్, ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాది నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. తెలుగులో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదని నమ్మకంగా చెప్పగలను.

టాలీవుడ్ మాత్రమే కాదు...

తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమవ్వాలనుకోవడం లేదు. బెంగుళూరులో చదువుకోవడం వలన నాకు కన్నడ కూడా అబ్బింది. సో, కన్నడలో కూడా ట్రై చేయాలనుకొంటున్నాను. అలాగే ఈ భాషలో అయినా క్యారెక్టర్ నచ్చితే నటించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.

ఆయన్ని కలవడమే నా అభిలాష...

నాకు అభిమాన కథానాయకుడు అంటే ఎవరూ లేరు కానీ.. రాజనీకాంత్ గారి సినిమాలు చిన్నప్పట్నుంచి చూస్తూ పెరగడం వలన, జీవితంలో ఒక్కసారినా ఆయన్ని కలవడమే నా ధ్యేయంగా పెట్టుకొన్నాను. అయితే.. నేను ఆయన్ని కలిసేప్పటికి, నేను ఎవరనేది ఆయని తెలిసి ఉండాలి. ఆ అర్హత పొందినప్పుడే నేను ఆయన్ని కలుస్తాను, అదే నా జీవితాశయం!