English | Telugu

టాలీవుడ్ నెక్స్ట్ టాప్ హీరోయిన్ కృతి శెట్టేనా?

టాలీవుడ్ నెక్స్ట్ టాప్ హీరోయిన్ కృతి శెట్టేనా?

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ గా ఎందరో అడుగు పెడుతుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే స్టార్స్ గా ఎదుగుతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే పరిస్థితులు కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నాయి.

కన్నడ బ్యూటీ కృతి శెట్టి చిన్నప్పటి నుంచే పలు యాడ్స్ లో నటించింది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ మొదలు పెట్టిన ఆమెకు 17 ఏళ్ళకే హీరోయిన్ గా నటించే అవకాశమొచ్చింది. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకుంది. సినిమా హిట్ అవ్వడంతో పాటు.. కృతి తన అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో అవకాశాలు క్యూ కట్టాయి. నాని సరసన 'శ్యామ్ సింగ్ రాయ్', నాగ చైతన్యకు జోడీగా 'బంగార్రాజు' సినిమాలు చేసిన ఆమె.. వరుసగా మూడు విజయాలు అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

కుర్రకారులో మంచి క్రేజ్ ఉండటం, హ్యాట్రిక్ విజయాలు దక్కడంతో కృతి శెట్టికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో రామ్ సరసన నటించిన 'ది వారియర్', నితిన్ సరసన నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్న కృతి.. కుర్ర హీరోలను అందరినీ కవర్ చేస్తోంది. సుధీర్ బాబుకి జోడీగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా చేస్తోంది. ఈ సినిమా కథ ప్రధానంగా ఆమె చుట్టూనే తిరుగుతుందట. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలకు కృతినే బెస్ట్ ఛాయస్ గా కనిపిస్తోంది. అందుకే నాగ చైతన్య.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న తన నెక్స్ట్ మూవీలోనూ కృతితో జోడీ కడుతున్నాడు.

దాదాపు యంగ్ హీరోలు అందరినీ కవర్ చేస్తున్న కృతికి ఒక్కసారి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశమొస్తే చాలు ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయినట్లే. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్స్ కొరత ఉంది. ఇటీవల #NTR30 కోసం కృతి పేరు పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. అదే నిజమైతే కృతి దశ తిరిగినట్లే. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా కృతి స్టార్ హీరోయిన్ కావడం ఖాయమనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కాజల్, తమన్నా, రకుల్, పూజ హెగ్డే వంటి ఎందరో హీరోయిన్స్ మొదట చిన్న సినిమాలతోనే కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్స్ గా ఎదిగారు. త్వరలోనే కృతి శెట్టి కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.

టాలీవుడ్ నెక్స్ట్ టాప్ హీరోయిన్ కృతి శెట్టేనా?