English | Telugu

దేవుడున్నాడు.. చూద్దాం ఏం జరుగుతుందో!

దేవుడున్నాడు.. చూద్దాం ఏం జరుగుతుందో!

నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. విజయోత్సాహంలో ఉన్న అఖండ మూవీ టీమ్ తాజాగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వివాదం గురించి, మల్టీస్టారర్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు!

అఖండ సినిమా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామని బాలకృష్ణ అన్నారు. సనాతన ధర్మాన్ని తెలియజేసిన సినిమాగా ‘అఖండ' అందరి మన్ననలూ పొందిందన్న ఆయన.. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరూ కలిసి సకుటుంబసపరివార సమేతంగా థియేటర్లకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కథ బాగుంటే తాను ఖచ్చితంగా మల్టీస్టారర్ సినిమాలో న‌టిస్తాన‌ని చెప్పారు. తాను మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడూ కాదనలేదని, సరైన కాస్టింగ్ ను బట్టి నిర్ణయం తీసుకుంటామ‌ని అన్నారు.

Also Read:  'అన్ స్టాపబుల్' షోలో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. బాబాయ్ తో అబ్బాయి!

ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరల విషయంపై ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు తామంతా చర్చించామని.. కానీ, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి సినిమాని విడుదల చేసారని తెలిపారు. టికెట్‌ ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా, తాము అన్నింటికీ సిద్ధమయ్యే ధైర్యంగా అఖండను రిలీజ్‌ చేశామ‌ని అన్నారు. సినిమా టికెట్‌ ధరల జీవో రద్దుపై ఏపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం.. న్యాయ నిర్ణేతగా దేవుడున్నాడు.. ఆయనే చూసుకుంటాడు అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.