English | Telugu
రివ్యూలను కెలికేసిన కోన వెంకట్
Updated : Jun 2, 2015
రామ్ నటించిన పండగచేస్కో సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లంతా 'రొటీన్'గానే ఉంది కదా... అని పెదవి విరుస్తున్నారు. రివ్యూలైతే ఈ సినిమాకి ఏకి పారేశాయి. 'ఢీ రెడీ సినిమాల్లానే ఉంది.. ఓ పది సినిమాల్ని చూసి ఫీలింగొస్తోంది..' అంటూ ఘాటుగానే విమర్శించారు. ఈ విమర్శలు మాటలు, స్ర్కీన్ ప్లే అందించిన కోన వెంకట్‌ని నేరుగా తాకాయి. ఎన్నిసార్లు ఒకే స్ర్కీన్ ప్లేని అటూ ఇటూ తిప్పి చూపిస్తాడంటూ కోనని అందరూ టార్గెట్ చేశారు. దాంతో కోన 'పండగ చేస్కో' సక్సెస్ మీట్లో రివ్యూలపై రెచ్చిపోయాడు. ''మేం రొటీన్ సినిమానే తీశాం. రొటీన్ కథే రాశాం. రామ్ కూడా రొటీన్ గా బాగా చేశాడు. అందుకే కలెక్షన్లు కూడా రొటీన్‌గా సూపర్‌గున్నాయి'' అంటూ రొటీన్ అనే పదంపై కౌంటర్ వేశాడు. అంతే కాదు.. మేం రివ్యూల కోసం సినిమాలు తీయం.. రెవిన్యూ కోసమే తీస్తాం అనేశాడు. ఓ పాత్రికేయ మిత్రుడు సినిమా విడుదలకు ముందే తనకు ఫోన్ చేసి 'మీ సినిమాని ఏకేస్తాం చూడు' అన్నాడని, కలాలతో కాకుండా కత్తులతో థియేటర్‌కి వెళ్లి సినిమాని ఏకి పాడేశారని... రోటీన్ సినిమా అనే ముద్ర వేశారని, అయినా ప్రేక్షకులు ఆదరించాడని ఎద్దేవా చేశాడు. ఎందుకనో ఈ వ్యవహారాన్ని కోన వెంకట్ కావాలనే కెలుక్కొంటున్నాడని పిస్తోంది. సినిమా వచ్చింది... రొటీన్ అనే ముద్ర పడిపోయింది. రెండ్రోజులు పోతే ఈసినిమాని జనం, మీడియా మర్చిపోదును. కానీ.. కోనవెంకట్ కావాలనే మళ్లీ కెలికాడు. మరి మున్ముందు ఈ సినిమాని మీడియా ఇంకెలా ఏకిస్తుందో చూడాలి.