English | Telugu
ఆంధ్రాపోరి రివ్యూ
Updated : Jun 5, 2015
టెన్త్ క్లాస్ ప్రేమకథలంటే ఓ రకమైన విరక్తొచ్చేసింది. వయసు చిన్నది.. వాళ్లు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ముదురువి. ప్రేమ పేరుతో.. సెక్స్‌ని జొప్పించి.. అదే ప్రేమని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. `ఈతరం ఇలానే ఉంటుంది.. ఇలానే ఉండాలి కూడా..` అనే భావాన్ని మనలో ఇంజక్ట్ చేస్తుంటారు. పెద్దవాళ్లు, సంస్ర్కృతికి సంప్రదాయాలకు ప్రాణం ఇచ్చేవాళ్లంతా `ఇవేం సినిమాల్రా బాబూ` అని తలలు పట్టుకొంటే, పిల్లకాయలు మాత్రం చొంగకార్చుకొంటూ చూసేస్తారు. నిర్మాతల ధైర్యం కూడా అంతే. వాళ్ల బలహీనతల్ని క్యాష్ చేసుకొని పబ్బం గడుపుకోవాలనుకొంటారు. `ఆంధ్రా పోరి` అనే టైటిల్ చూశాక, ఇది కూడా టీనేజీ లవ్ స్టోరీ అనే విషయం తెలిశాక ఇదీ ఆ తానులో ముక్కే అనే అనుమానం వేస్తుంది. కానీ థియేటర్లోకి అడుగుపెడితే.. ఒక్కో సీన్ ఒక్కోసీన్ గడిస్తే.. ఇది వేసవిలో పన్నీటి జల్లు అనిపిస్తుంది. గంజాయి మొక్కల మధ్య ఆ మలినం అంటని తులసివృక్షం అనే భావన కలుగుతుంది. టీనేజీ లవ్ స్టోరీని ఇంత అందంగానూ చెప్పొచ్చా అనిపిస్తుంది. మరింతకీ ఈ ఆంధ్రాపోరి ప్రేమకథేంటి..?? ఈనాటి దౌర్భాగ్యపు ప్రేమకథల మధ్య తన ప్రత్యేకతను ఎలా నిలుపుకొంటుంది అనే విషయాలు ఆరా తీసేముందు కథలోకి వెళ్లిపోవాల్సిందే.
నర్సింగ్ (ఆకాష్) పదోతరగతి తప్పిన ఓ మొద్దబ్బాయి. జీవితం అంటే హుషారుగా సాగిపోవడమే అన్నది అతని సిద్దాంతం. చిరంజీవికి పెద్ద ఫ్యాను. చిరు పాటలకు స్టెప్పులు వేసుకొంటూ.. సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ప్రశాంతి (ఉల్కాగుప్తా)కి చదువంటే ప్రాణం. నాన్న అంత డిసిప్లెన్ గా పెంచారు. ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. ప్రశాంతిని చూడగానే నర్సింగ్‌లో ప్రేమ మొదలవుతుంది. నర్సింగ్‌లో దూకుడు చూసి ప్రశాంతి కూడా ఆకర్షణకు లోనవుతుంది. అతని ప్రేమలో పరీక్షలు తప్పుతుంది. దాంతో `నువ్వు పరీక్షల్లో మళ్లీ ఫస్టు మార్కులతో పాసవ్వు. ఆ తరవాత నర్సింగ్ వ్యవహారం చూద్దాం` అని నాన్న మాటిస్తాడు. దాంతో మళ్లీ చదువుపై దృష్టిపెడుతుంది ప్రశాంతి. పరీక్షల్లో ప్రశాంతి గెలిచిందా? నర్సింగ్ ప్రేమను సంపాదించిందా? అనేదే కథ.
చాలా సింపుల్ కథిది. కథలో మెలికలు, ఊహించని అద్భుతాలేం లేవు. కాకపోతే.. ఆ కథని నడిపిన విధానం, పండించిన భావోద్వేగాలు, సంభాషణలు ఇవన్నీ తప్పకుండా ఆకట్టుకొంటాయి. ముందే చెప్పినట్టు పదో తరగతి ప్రేమకథంటే తప్పు ఉద్దేశంతో వెళ్లినవాళ్లంతా మదిరాజ్ కథన నైపుణ్యానికి ముగ్థులైపోయి సిసలైన ప్రేమకథని చూస్తున్నామన్న భావన వస్తుంది. కేవలం రెండే రెండు పాత్రలు, ఈ సినిమా మొత్తాన్ని భుజానెత్తుకొని మనకు `సీతాకోక చిలుక` రోజుల్ని ఆ సినిమా తాలుకు అనుభూతుల్ని ఇప్పుడు ఫ్రెష్షుగా గుర్తుకు తెస్తాయి. తొలి సన్నివేశాలు నిజామాబాద్ నర్సింగ్ అల్లరి, వాడి సరదాలు, ఆకతాయి వేషాలతో సరదాగానే సాగిపోతుంది. ఆ తరవాతర్వాత `ప్రేమ సడి` మొదలవుతుంది. లేలేత చిరు హృదయాల ప్రేమకథని ఎంత సున్నితంగా ట్రీట్ చేయాలో అంతే చేస్తూ.. మనల్ని తొలి ప్రేమతాలుకూ అనుభూతుల్లోకి తీసుకెళ్తాడు. ఎక్కడా ఒక్క సీన్‌లో కూడా అసభ్యత, అశ్లీలత, ద్వంద్వార్థం ధ్వనించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. దాంతో మన మనసు కూడా కుదుట పడి.. హాయిగా సినిమావైపు మళ్లుతుంది.
అసలు సిసలు గొప్పదనమంతా మరాఠీ `టైమ్‌సాస్`చిత్రానిదే అనుకోవక్కర్లెద్దు. ఎందుకంటే మాతృక అదే అయినా.. మనకు కావల్సినంత పైత్యం జోడించే అవకాశం ఉంది ఈ కథలో. అయితే దర్శకుడు నిజాయతీగా వ్యవహరించాడు. దాని జోలికి పోకుండా.. కేవలం అనుభూతులపైనే తన దృష్టి కేంద్రీకరించాడు. ఈ కథకు తీసుకొన్న కాలం, ఎంచుకొన్న నేపథ్యం, చూపించిన లొకేషన్లు కొత్తగా ఉండడంతో... మనం కూడా ఆ కాలంలోనే ప్రయాణిస్తాం. నిజానికి ఇది యాంటీ క్లైమాక్స్. అయినా సరే.. ఓ రకమైన సంతృప్తితో జనాలు థియేటర్ నుంచి బటయకు వస్తారు. సరైన ముగింపే ఇచ్చాడన్న సంతృప్తి అది. ఎందుకంటే టీనేజీ కథని ఓ పెళ్లితో శుభం కార్డు వేయలేం. అక్కడ ఇంకేదో చేయాలి. దర్శకుడు అదే చేశాడు. పిల్లలకు, పెద్దవారికీ, సంప్రదాయాలంటే గౌరవం ఉన్నవారికీ నచ్చే ముగింపు అది. నర్సింగ్ యాదవ్‌లో ఎదగాలన్న తపన, పట్టుదల సహజంగా వచ్చినవి. ఎవరో లెక్చర్ల ద్వారా బలవంతంగా ఇంజక్ట్ చేసిందేం కాదు. అది సహజంగా ఉండడంతో.. క్లైమాక్స్ మరింత ఆకట్టుకొంటుంది.
ఆకాష్ పూరికి ఇదివరకు నటించిన అనుభవం ఉంది. కాకపోతే ఇదే కాస్త లెంగ్త్ ఎక్కువ. దాంతో పాటు హీరో అయ్యాడు. అయితే... తన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసేశాడు. చలాకీ సన్నివేశాల్లో నటించడం గొప్ప కాదుగానీ, భావోద్వేగాలు పలికించాల్సివచ్చినప్పుడు తేలిపోకూడదు. కానీ అక్కడా ఆకాష్ ఆకట్టుకొంటాడు. కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందన్నది అర్థమవుతూనే ఉంది. ఉల్కా గుప్తా కూడా అంతే. తనో సీరియల్ నటి. సెంటిమెంట్ పండించడం తేలికైన విద్య. ఇక్కడా అదే ప్రతిభను ఇంచు కూడా తగ్గించకుండా చూపించేసింది. అరవింద్ కృష్ణ నటన కూడా డీసెంట్‌గా ఉంది.
సాంకేతికంగా జోశ్యభట్ల సంగీతంలో థేతడి.. పాట క్యాచీగా ఉంది. పాటలకంటే నేపథ్య సంగీతానికే ఎక్కువ మార్కులు పడతాయి. సంభాషణల్లో మెలోడ్రామా లేదుగానీ... అవన్నీ ఆకట్టుకొనేవే. సన్నివేశానికి ఎంత మాట కావాలో అంతే రాసుకొన్నాడు. చాలా చోట్ల సంభాషణల బలం వల్ల సీన్ ఎలివేట్ అయ్యింది. సెకండాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. కథని డిటైల్డ్‌గా చెప్పినప్పుడు ఈ ఇబ్బందులు తప్పవు. రెండో విషయం. మనం ఓ టీనేజీ ప్రేమకథ చూస్తున్నాం అని ప్రిపేర్ అయిపోయి థియేటర్లకు వెళ్లాలి. ఈ వయసులో ప్రేమేంటి అన్న ఫీలింగ్ వస్తే... ఈ కథలో లీనమవ్వలేం. అక్కడక్కడా సన్నివేశాన్ని సాగదీసినట్టు అనిపిస్తుంది. దాన్నీ భరించాల్సిందే.
మొత్తానికి ఆంధ్రాపోరీ ఓ డీసెంట్ ఫిల్మ్. నటీనటులు, సాంకేతిక నిపుణులూ కలసికట్టుగా ఓ రీమేక్ కథలోని అందం, ఆర్థ్రత చెడిపోకుండా.. తీసిన సినిమా ఇది. ఒక్కసారి చూడండి.. మీకే అర్థం అవుతుంది.
రేటింగ్ 2.75/5