Read more!

English | Telugu

సినిమా పేరు:వీర
బ్యానర్:శాన్వి ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:May 20, 2011

శ్యామ్( "కిక్"శ్యామ్) చాలా నిజాయితీ పరుడైన పోలీసాఫీసర్. ధనరాజ్ కొడుకు కాలేజీలో అమ్మాయిలను ఏడిపిస్తూంటే అతన్ని కఠినంగా శిక్షిస్తాడు శ్యామ్. అప్పుడు పొరపాటున ధనరాజ్ చేతిలో అతని కొడుకు మరణిస్తాడు. దాంతో శ్యామ్ మీద ధనరాజ్ పగబడతాడు. తన కొడుకు చనిపోయినందుకు ప్రతిగా శ్యాం కొడుకు మోక్షను కిడ్నాప్ చేయిస్తాడు ధనరాజ్. శ్యామ్ తన కొడుకుని రక్షించటానికి ఎంత ప్రయత్నించినా కాపాడుకోలేకపోతాడు. ధనరాజ్ మోక్షని చంపేస్తాడు.

శతృవుల బారి నుంచి శ్యామ్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రభుత్వం దేవా(అజయ్) అనే బాడీ గార్డుని నియమిస్తుంది. కానీ దేవ స్థానంలో వీర (రవితేజ) అనే తెలివైన సాహసవంతుడు వస్తాడు. వీర మంచి మనసున్న వ్యక్తి. శతృవులకు అతనంటే సింహస్వప్నం. శ్యాం కుటుంబాన్ని వీర కాపాడుతూంటాడు. ఐక్యతో వీర కు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.

అసలు బాడీ గార్డ్ వీర కాదు....దేవా స్థానంలో వీరా వచ్చాడని తెలుసుకున్న శ్యామ్ అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటాడు. ఆ సమయంలో చనిపోయాడనుకున్న శ్యామ్ కొడుకు మోక్షను వీరా శ్యామ్ కుటుంబానికి చూపిస్తాడు. అప్పుడు శ్యామ్ ఏం చేశాడు...? దేవా స్థానంలో వీరా ఎందుకొచ్చాడు....? అసలు వీరా గతమేంటి....? శ్యామ్ కుటుంబానికి వీరాకీ సంబంధం ఏమిటి...? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే "వీర" సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

విశ్లేషణ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాలో టేకింగ్ కి ఇచ్చిన ప్రాథాన్యత స్క్రీన్ ప్లే కి ఇచ్చివుంటే బాగుండేది. దర్శకత్వం పరంగా చూస్తే సినిమా గ్రాఫ్ పడుతూ లేస్తూ నానా అగచాట్లూ పడింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు మనస్సుకు హత్తుకునేలా ఉన్నా, ఆ సీన్ల ప్రభావం అలా నిలబడిపోయేలా, ప్రేక్షకులను సినిమాలోకి లీనమయ్యేలా చేయటంలో దర్శకుడి వైఫల్యం కనపడుతుంది.

ఉదాహరణకు శ్రీదేవి కొడుకుని చూడటానికి తాపత్రయపడే సీన్, సుబ్బరాజు కారులో వెళ్తూ తల్లీ కొడుకుల మీద బురద జల్లే సీన్. ఆ తర్వాత రవితేజ అతనికి బుద్ధి చెప్పే సీన్, రవితేజ తమ ఆస్తంతా తమ చెల్లి పేరు మీద మార్చి ఆ దస్తావేజులు పిన్నికిచ్చే సీన్ ఇలాంటి సీన్లన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి...కానీ ఆ తర్వాత వచ్చే సీన్లు వాటి ప్రభావాన్ని నిలబెట్టి ఉంటే సినిమా బాగుండేది. రవితేజను పెళ్ళి చేసుకున్న కాజల్ అగర్వాల్ ప్రేమ కలిగే వరకూ శోభనానికి అంగీకరించననటం కూడా ఫుట్టేజ్ పెంచటం కోసం తప్పితే సినిమాకి ఉపయోగ పడిందేం లేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - రవితేజ ప్రతి సినిమాలోలా తన సహజ శైలిలో ఫుల్ జోష్ తో నటించాడు. అలాగే కాజల్ అగర్వాల్, తాప్సి, శ్యామ్, శ్రీదేవి, నాజర్, రోజా ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం, వేణు మాధవ్ ల కామెడీ ఈ సినిమాలో ఎందుకనో ఆశించిన స్థాయిలో పండలేదు.వీళ్ళకంటే ఆలీ కాస్త బెటరనిపించాడు.

సంగీతం - పాటలన్నీ ఫరవాలేదు. రీ-రికార్డింగ్ కూడా బాగానే ఉంది.

సినిమాటోగ్రఫీ - బాగుంది.

మాటలు - ఈ సినిమాకు అబ్బూరి రవి రచన, మరో ముగ్గురు రచనా సహకారం చేస్తే, మరి పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి ఏం చేశారో, ఏం రాశారో అర్థం కాదు. అయినా ఈ సినిమాలోని మాటలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

పాటలు - పాటల్లో సాహిత్యం ఓ మోస్తరుగా ఉంది.

ఎడిటింగ్ - సగటు స్థాయిలోనే ఉంది. కారణం గౌతం రాజుగారు బహుశా వాళ్ళమ్మాయి పెళ్ళి పనుల్లో బిజీగా ఉండి ఉంటారు.

ఆర్ట్ - బాగుంది.

కొరియోగ్రఫీ - యావరేజ్ గా ఉంది.

యాక్షన్ - ఇది మాస్ ప్రేక్షకులకు కావలసినంతగా నచ్చే స్థాయిలో ఉంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మీరు మాస్ యాక్షన్ తో పాటు కాస్త సెంటిమెంట్ ఉన్న సినిమా కావాలంటే చూడండి. ఏదో అద్భుతంగా, గొప్పగా ఉంటుందనుకు వెళ్తే కాస్త నిరాశకు లోనవుతారు.